Nara Lokesh: ఇవాళ మీ మాట రాజకీయ కుట్రకోణం వైపు తిరిగిందెందుకు?: డీజీపీ సవాంగ్ పై లోకేశ్ విమర్శలు

  • విగ్రహాల ధ్వంసంపై కొనసాగుతున్న రాజకీయ రగడ
  • కుట్రకోణం ఉందన్న డీజీపీ
  • రాజకీయ పక్షాల ప్రమేయం ఉందని వెల్లడి
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు
  • ఘాటుగా స్పందించిన లోకేశ్
Nara Lokesh fires on AP DGP Gautam Sawang

ఏపీలో విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడులు రాజకీయ రగడకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యల పట్ల విపక్షనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాలపై దాడులతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని, పలు పార్టీలకు చెందినవారికి ఇందులో ప్రమేయం ఉందని డీజీపీ వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందుత్వం మనుగడనే ప్రశ్నించేలా దాడులు జరుగుతుంటే నిందితులను పట్టుకోవడం చేతకాక చేవచచ్చిన మీపై ముందు కేసు పెట్టాలంటూ మండిపడ్డారు. తప్పుడు సమాచారంతో రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నందుకు కోర్టులు మీపై సుమోటోగా కేసు నమోదు చేయాలని వ్యాఖ్యానించారు.

"విగ్రహాలు ధ్వంసం చేసింది దొంగలు, పిచ్చోళ్లని నిన్న చెప్పిన డీజీపీ దొరా... ఇవాళ మీ మాట రాజకీయ కుట్రకోణం వైపు తిరిగిందెందుకు? తాడేపల్లిలో మీకు జగన్ మార్కు భోగి పళ్లేమైనా పోశారా? మీరు విడుదల చేసిన జాబితాలో కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లులో దేవాలయాన్ని కూల్చివేసిన వైసీపీ నేత దామోదర్ రెడ్డి పేరు లేదేం? ఓంకార క్షేత్రంలో అర్చకులను చితక్కొట్టిన వైసీపీ నేత ప్రతాపరెడ్డి పేరు ప్రస్తావించలేదెందుకు? ఆంజనేయుడి చేయి విరిగితే రక్తం వస్తుందా... రాముడి తల తెగితే విగ్రహం ప్రాణం పోతుందా? అని హిందూత్వంపైనే దాడికి దిగిన బూతుల మంత్రి నానిపై ఎందుకు కేసు పెట్టలేదు?" అని ప్రశ్నించారు.

పరస్పర విరుద్ధ ప్రకటనలతో ఏపీ పోలీసులపై నమ్మకం పోతోంది: విష్ణు వర్ధన్ రెడ్డి

విగ్రహాల ధ్వంసం ఘటనల్లో నలుగురు బీజేపీ కార్యకర్తలున్నారంటూ ఏపీ పోలీసులు చెబుతున్నారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. 24 గంటల క్రితం డీజీపీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ ఘటనలకు రాజకీయ కుట్రలు కారణం కాదని, ఎవరికీ సంబంధం లేదని చెప్పారని, కానీ అంతలోనే ఇది విపక్షాల కుట్ర అని ప్రకటించారని, ఎవరి ఒత్తిళ్లతో ఆ ప్రకటన చేయాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇందులో బీజేపీ కార్యకర్తలను బాధ్యులుగా చేస్తున్నారని, సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కేసుకు, ఆలయాలపై దాడుల ఘటనల కేసుకు ఏమిటి సంబంధం? అని విష్ణువర్ధన్ రెడ్డి నిలదీశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కేసుకు, దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం కేసులకు తేడా తెలియని స్థితిలో ఏపీ పోలీసులు అధికారులు నటిస్తున్నారని, ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదని ధ్వజమెత్తారు.

More Telugu News