Whatsapp: వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

  • ఇటీవలే ప్రైవసీ పాలసీ అప్ డేట్ చేసిన వాట్సాప్
  • యూజర్లకు ఫిబ్రవరి 8 వరకు గడువు
  • పిటిషన్ వేసిన ఢిల్లీ న్యాయవాది
  • వాట్సాప్ కు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి
PIL in Delhi High Cour on Whatsapp new privacy policy

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ యూజర్ల వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించేదిగా ఉందని ఢిల్లీకి చెందిన న్యాయవాది చైతన్య రోహిల్లా తన పిటిషన్ లో పేర్కొన్నారు. యూజర్ల వర్చువల్ కార్యకలాపాలపై వాట్సాప్ ఓ కన్నేసేందుకు నూతన ప్రైవసీ పాలసీ వీలు కల్పిస్తోందని ఆరోపించారు.

వాట్సాప్, దాని మాతృసంస్థ ఫేస్ బుక్ ఇప్పటికే వ్యక్తుల సమాచారాన్ని అక్రమ రీతిలో మూడో పక్షంతో పంచుకుంటున్నాయని, ఇప్పుడు కూడా వాట్సాప్ కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొత్త ప్రైవసీ పాలసీ తీసుకువచ్చిందని వెల్లడించారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై తక్షణమే స్టే ఇవ్వాలంటూ న్యాయవాది చైతన్య రోహిల్లా తన పిటిషన్ లో కోరారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను వాట్సాప్ పాటించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.

కాగా, వాట్సాప్ గతవారమే తన ప్రైవసీ పాలసీని అప్ డేట్ చేసింది. ఈ పాలసీని యూజర్లు అంగీకరించకపోతే ఫిబ్రవరి 8 నుంచి వారి మొబైల్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది.

More Telugu News