Supreme Court: సుప్రీం కమిటీ సభ్యులు కేంద్రానికి అనుకూలం... తమకు సమ్మతం కాదంటున్న రైతు సంఘాలు!

  • వ్యవసాయ చట్టాల రద్దు మాత్రమే సమ్మతం
  • కమిటీ రిపోర్టు కేంద్రానికి అనుకూలంగా ఉంటుంది
  • సుప్రీం తీర్పు సమ్మతం కాదంటున్న రైతు సంఘాల నేతలు
Farmers Not Accept Supreem Committee

దాదాపు 50 రోజులకు పైగా న్యూఢిల్లీ శివార్లలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ధర్నా చేస్తున్న నేపథ్యంలో.. నిన్న సుప్రీంకోర్టు వాటి అమలుపై స్టే విధిస్తూ, సమస్యల పరిష్కారానికి కమిటీని వేస్తున్నట్టు ప్రకటించినా, రైతులు మెట్టు దిగలేదు. ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని, తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం లేదని అంటున్న రైతు సంఘాలు, నిరసనలను కొనసాగించేందుకే నిర్ణయించాయి.

ఈ కమిటీని తాము అంగీకరించే ప్రసక్తే లేదని, కమిటీ సభ్యులంతా వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా మాట్లాడిన వారేనని, వీరంతా ప్రభుత్వానికి అనుకూలంగానే తమ రిపోర్టును ఇస్తారని భావిస్తున్నామని పంజాబ్ కు చెందిన రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా, ఈ కమిటీలో భారతీయ కిసాన్ యూనియన్, ఇండియా కిసాన్ సమన్వయ కమిటీ జాతీయ అధ్యక్షుడు భూపేందర్ సింగ్ మాన్, వ్యవసాయ ఆర్థిక వేత్త డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైస్ మాజీ చైర్మన్ అశోక్ గులాటీ, షేత్కారీ సంఘటన చీఫ్ అనిల్ ఘన్వాట్ లను సభ్యులుగా సుప్రీం నియమించిన సంగతి తెలిసిందే.

గులాటీ గతంలో ప్రధాని ఆర్థిక సలహా సంఘంలో 1999 నుంచి 2001 వరకూ పనిచేశారు. వ్యవసాయ చట్టాలను తేవాలని గతంలో పలు పత్రికల్లో వార్తలనూ రాశారని రైతు సంఘాలు అంటున్నాయి. గత డిసెంబర్ లో వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్'లో ఆయన వ్యాసం కూడా రాశారు. ఇక ఘన్వాట్ విషయానికి వస్తే, షేత్కారీ సంఘటన్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన  మహారాష్ట్రకు చెందిన వారు. వ్యవసాయ చట్టాలను తీసుకుని వచ్చిన తరువాత ఆయన సెలబ్రేషన్స్ చేసుకున్నారని రైతులు అంటున్నారు.

ఇదే సమయంలో భూపేందర్ సింగ్ మాన్, గతంలో రైతుల ప్రతినిధిగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తో చర్చలు సాగించిన వారిలో ఉన్నారు. ఆ సమయంలో వ్యవసాయ చట్టాలకు తాము అనుకూలమని ఆయన వ్యాఖ్యానించారని రైతులు అంటున్నారు. నలుగురు సభ్యుల కమిటీ తమ డిమాండ్లను తీర్చేలాలేదని, దీన్ని తాము అంగీకరించబోమని అంటున్నారు. ఈ చట్టాలను రద్దు చేయడం ఒక్కటే తమ డిమాండని స్పష్టం చేస్తున్నారు.

More Telugu News