Telangana: సంక్రాంతి తరువాత తెలంగాణలో తెరచుకోనున్న స్కూళ్లు!

  • ఇప్పటికే విద్యా సంవత్సరాన్ని నష్టపోయిన స్టూడెంట్స్
  • నేడు మంత్రులు, కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం
  • కీలక నిర్ణయాలు తీసుకోనున్న టీఎస్ సర్కారు
Schools Will Reopen in Telangana After Sankranthi

సంక్రాంతి పర్వదినాల తరువాత తెలంగాణలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. తొలి దశలో 9, ఆపై తరగతులు చదివే విద్యార్థులను మాత్రమే స్కూళ్లకు అనుమతించాలని, తదుపరి దశలో పరిస్థితిని బట్టి, మిగతా క్లాసుల విషయమై ఓ నిర్ణయానికి రావచ్చని విద్యా శాఖ నుంచి సీఎం కేసీఆర్ కు ప్రతిపాదనలు అందాయి. ఈ అంశంపై నేడు మంత్రులు, కలెక్టర్లతో జరిగే భేటీలో కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

కాగా, క్లాసుల నిర్వహణకు పలు షరతులను విధిస్తూ, ఆయా షరతులను, నిబంధనలను పాఠశాలలు పాటిస్తున్నాయా? అన్న విషయమై పటిష్ఠమైన నిఘాను ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. నేడు కేసీఆర్ నిర్వహించనున్న సమావేశంలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ సాగనుండగా, ధరణి, రెవెన్యూ సమస్యలపైనా కేసీఆర్ తన సహచరుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.

కేసీఆర్ తో రెవెన్యూ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య, అటవీ, మునిసిపల్ శాఖల అధికారులు, పలువురు మంత్రులు, కలెక్టర్లు సమావేశం కానున్నారు. తదుపరి దశ పల్లె, పట్టణ ప్రగతి షెడ్యూల్ ను కూడా ఈ సమావేశంలోనే ఖరారు చేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇప్పటివరకూ 7 రాష్ట్రాల్లోని పాఠశాలలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను సమీక్షించిన తరువాత తెలంగాణ విషయమై ఓ నిర్ణయం వెలువడుతుందని సమాచారం.

కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తుండటం, విద్యార్థులంతా ఇప్పటికే ఓ విద్యా సంవత్సరాన్ని కోల్పోవడంతో సాధ్యమైనంత త్వరగా, క్లాసులను ప్రారంభించి, పరీక్షల షెడ్యూల్ ను కొంత ఆలస్యంగానైనా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు స్కూళ్ల రీ ఓపెనింగ్ కు తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేయగా, రోజు విడిచి రోజు క్లాసుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించవచ్చని సమాచారం.

More Telugu News