Supreme Court: గృహిణి త్యాగాలకు, చేసే చాకిరి కూడా ఆదాయమే: సుప్రీంకోర్టు కీలక తీర్పు

  • బీమా కంపెనీ పరిహారం విషయంలో వ్యాజ్యం
  • గృహిణి చేసే పని కూడా ఆదాయమేనన్న సుప్రీం
  • బీమా పరిహారాన్ని పెంచాలని త్రిసభ్య ధర్మాసనం తీర్పు
Supreem Court Says Insurence Company that Calculate Notional Income of Housewife

దేశంలో లింగ సమానత్వాన్ని సాధించే దిశగా జరుగుతున్న పోరాటంలో, సుప్రీంకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ బీమా వివాదం కేసును విచారించిన జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం, ఇళ్లలో గృహిణులు నిర్వహించే రోజువారీ పనులు, త్యాగాలను కూడా వారి ఆదాయంగానే చూడాలని సూచించింది.

ఇంటి పనుల కోసం వారు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారో, పనులకు ఎలా అంకితం అయ్యారో తెలుసుకోవాలని బీమా కంపెనీకి చివాట్లు పెట్టింది. ఇండియాలో పురుషుల కన్నా స్త్రీలే ఇంటి పనుల్లో ఎక్కువగా నిమగ్నమై ఉంటారని, కుటుంబానికి ఆహారం వండి పెట్టడం నుంచి సరుకుల సంగతి చూడటం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, పిల్లల అవసరాలను చూడటం, వస్తున్న ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులను నిర్వహించడం వంటి ఎన్నో పనులు చేస్తుంటారని జస్టిస్ ఎన్వీ రమణ తమ తీర్పులో వ్యాఖ్యానించారు.

ఇక ఈ కేసు వివరాలు పరిశీలిస్తే, 2014లో జరిగిన ఓ ప్రమాదంలో భార్యా భర్తలు ఇద్దరు చనిపోయారు. వారికి ఇద్దరు పిల్లలు. భర్త ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటే, భార్య గృహిణిగా ఉన్నారు. వీరికి రూ. 40.17 లక్షల బీమా పరిహారాన్ని ఇవ్వాలని ట్రైబ్యునల్ ఆదేశించింది. అయితే, చనిపోయిన వ్యక్తి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, అంత బీమా పరిహారం రాదంటూ, సదరు సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఈ మొత్తాన్ని రూ. 22 లక్షలకు తగ్గిస్తూ, తీర్పు వెలువడింది.

ఆపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, గృహిణి చేస్తున్న చాకిరిని కూడా ఆదాయంగానే తీసుకోవాలని సూచిస్తూ, బీమా కంపెనీ రూ. 30.20 లక్షలను 9 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని తుది తీర్పు ఇచ్చింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లో చెల్లించాలని ఆదేశించింది.

More Telugu News