Brexit: ఈయూతో బంధం పరిసమాప్తం.. అధికారికంగా టాటా చెప్పేసిన బ్రిటన్​

  • డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి వేరు బంధం
  • ఈయూ కన్నా మెరుగ్గా రాణిస్తామన్న ప్రధాని బోరిస్
  • ఆర్థిక కష్టాలు తప్పవంటున్న విమర్శకులు
New era for UK as it completes separation from European Union

ఐరోపా సమాఖ్య (ఈయూ)తో బ్రిటన్ బంధం పూర్తిగా తెగిపోయింది. కొత్త సంవత్సరాన్ని కొత్త ఆశలతో ప్రారంభించేందుకు డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి అధికారికంగా ఈయూతో విడాకులు తీసేసుకుంది. 27 దేశాల కూటమితో ఉన్న ఐదు దశాబ్దాల బంధాన్ని తెంచేసుకుంది. నాలుగున్నరేళ్లుగా సాగుతున్న బ్రెగ్జిట్ డీల్ కు విముక్తి కల్పించింది.

‘‘ఇక, బ్రిటన్ ఇప్పుడు బహిరంగ, దాతృత్వ, అంతర్జాతీయ, స్వేచ్ఛా వాణిజ్య దేశం. ఇక నుంచి ఈయూ కన్నా మెరుగ్గా రాణించేందుకు ఏ నిర్ణయమైనా స్వతంత్రంగా తీసుకునే స్వేచ్ఛ దొరికింది’’ అని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ నూతన సంవత్సర ప్రసంగంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు స్వాతంత్ర్యం తమ చేతుల్లోకి వచ్చిందని, దాని నుంచి వీలైనంత వరకు లబ్ధి పొందుతామని అన్నారు. ఈయూ నుంచి విడిపోవడం బాధ కలిగించేదే అయినా.. తప్పట్లేదన్నారు.

కాగా, అంతకుముందు బుధవారం బ్రెగ్జిట్ డీల్ పై చర్చల్లో భాగంగా.. దేశ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతుందని పార్లమెంట్ లో బోరిస్ వ్యాఖ్యానించారు. సొంత చట్టాలు, దేశ గతిని మార్చే హక్కులు, నియంత్రణ మన చేతుల్లోకి వస్తాయంటూ ఎంపీలకు చెప్పారు. అయితే, బ్రెగ్జిట్ డీల్ విమర్శకులు మాత్రం.. రాబోయే రోజుల్లో బ్రిటన్ కు ఆర్థిక కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

చేయాలనుకుంటున్న మార్పులకు చాలా వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు ఇంకా సిద్ధం కాలేదని అంటున్నారు. ఈయూతో విడిపోయినందున ఆ కూటమిలోని సభ్య దేశాలకు ఎగుమతులు చేయాలంటే.. ప్రతి వాహనానికీ కస్టమ్స్ చెకింగ్స్ తప్పనిసరిగా ఉంటాయని, దాని వల్ల సరకు రవాణా చాలా ఆలస్యమవుతుందని, ఆదాయంలో కోత పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News