Supreme Court: రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై ఏపీ సర్కారు పిటిషన్... హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

  • ఏపీలో రాజ్యాంగ సంక్షోభం అంటూ హైకోర్టు జస్టిస్ వ్యాఖ్యలు
  • విచారణ ఆపాలన్న ఏపీ సర్కారు
  • తిరస్కరించిన ఏపీ హైకోర్టు
  • సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
  • సర్కారుకు ఊరటనిస్తూ సుప్రీం ఆదేశాలు
Supreme Court stays on high court orders over constitution breakdown

ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందంటూ హైకోర్టు జడ్జి జస్టిస్ రాకేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపగా, రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంలో నిగ్గు తేలుస్తామంటూ హైకోర్టు విచారణకు ఉపక్రమించింది. రాజ్యాంగ విచ్ఛిన్న అంశంపై విచారణ ఆపాలంటూ ఏపీ సర్కారు కోరినా హైకోర్టు అంగీకరించలేదు. దాంతో ఈ అంశంపై ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ సర్కారు స్పెషల్ లీవ్ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం... ఏపీ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే వ్యాఖ్యానిస్తూ... రాజ్యాంగ సంక్షోభం చోటుచేసుకుందని హైకోర్టు జడ్జి ఎందుకు భావించారో అర్థం కావడంలేదని పేర్కొన్నారు. వ్యవస్థలు యథావిధిగా నడుస్తున్న వేళ రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని ఎలా చెప్పగలమని అన్నారు. వ్యవస్థ కుప్పకూలిపోలేదు కదా అని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అనంతరం ఈ పిటిషన్ పై తదుపరి విచారణను శీతాకాల సెలవుల అనంతరం చేపడతామని వెల్లడించింది.

More Telugu News