Amit Shah: రైతు నేతలను, సంఘాలను సంప్రదించకపోవడం తప్పేనన్న హోమ్ మంత్రి!

  • ముందుగా రైతులను సంప్రదించకపోవడం తప్పే
  • తమ వద్ద అంగీకరించారన్న రైతు సంఘాల నేత
  • అంశాల వారీగా చర్చలకు సిద్ధమన్న కేంద్రం
Some Mistake on Agri Bills Accepts Amit shah

వివాదాస్పదమైన రైతు చట్టాల విషయంలో, ముందుగానే రైతు నేతలను, సంఘాలను సంప్రదించకపోవడం తప్పేనని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అంగీకరించారు. ఈ విషయాన్ని నిరసనల్లో పాల్గొంటూ, ప్రభుత్వంతో చర్చలకు హాజరవుతున్న రైతు నేత శివకుమార్ శర్మ కాకాజీ తెలిపారు. అయితే, అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న విషయాన్ని హోమ్ శాఖ వర్గాలు ధ్రువీకరించాల్సి వుంది.

కాగా, నిన్న హరియాణాకు చెందిన పలువురు బీజేపీ నేతలు కేంద్ర మంత్రి తోమర్ ను కలిసి, తక్షణం తమ ఆందోళనలను విరమించేలా రైతులను ఒప్పించకుంటే, నియోజకవర్గాల్లో పరిస్థితులు మారిపోతాయని వారు స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరారు. ఆ తరువాత తోమర్ వెళ్లి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితని చర్చించారు.

ఇదిలావుండగా, ఈ చట్టాలపై అంశాల వారీగా చర్చించి, ఓ నిర్ణయానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం పేర్కొంది. చట్టాల రద్దుకు మాత్రం అవకాశాలు లేవని, అయితే, రైతులకు ఉన్న అన్ని అనుమానాలనూ నివృత్తి చేస్తామని కేంద్రం చెబుతోంది. ఇదే సమయంలో చట్టాల రద్దు మినహా తమకు మరే ఇతర పరిష్కారం ఆమోదయోగ్యం కాదని రైతు సంఘాల నేతలు భీష్మించుకుని ఉన్న సంగతి తెలిసిందే.

More Telugu News