Gorantla Madhav: గతంలో జరిగిన దాడుల గురించి మాట్లాడితే వంద రక్తచరిత్రలు కూడా సరిపోవు: ఎంపీ గోరంట్ల మాధవ్

  • గోరంట్ల మాధవ్, పరిటాల సునీత మధ్య మాటలయుద్ధం
  • టీవీ బాంబులు, మందుపాతరలతో చంపేశారన్న మాధవ్
  • దాడుల విషయంలో తాను చెప్పింది కొంతేనని వెల్లడి
  • పొలాలను రక్తంతో తడిపాడంటూ రవిపై వ్యాఖ్యలు
  • ఈ మరకలు తుడిచేందుకు జగన్ నీళ్లిస్తున్నాడని స్పష్టీకరణ
MP Gorantla Madhav comments

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన దాడుల గురించి మాట్లాడితే వంద రక్తచరిత్రలు కూడా సరిపోవని అన్నారు. టీవీ బాంబులు, మందుపాతరలతో ఒకేసారి పదుల సంఖ్యలో చంపేశారని పేర్కొన్నారు. దాడుల విషయంలో తాను చెప్పింది కొంతేనని అన్నారు.

అయితే, వైఎస్సార్ సీఎం అయిన తర్వాతే ఫ్యాక్షనిజం ఆగిందని చెప్పారు. పరిటాల రవి హత్య తర్వాత సునీతకు పోటీగా మద్దెలచెర్వు సూరిని బరిలో దింపలేదని తెలిపారు. ఫ్యాక్షన్ గొడవలు పడేవారి మధ్య రాజీ చేశారని వివరించారు.

రాప్తాడులో ఫ్యాక్షన్ రక్తపు మరకలు తుడవాలని సీఎం జగన్ చూస్తున్నారని మాధవ్ పేర్కొన్నారు. గతంలో అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున హత్యలు జరిగాయని, చనిపోయిన వాళ్లు గుంతల్లో ఉంటే, బతికున్నవాళ్లు జైల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. క్లేమోర్ మైన్లు, ల్యాండ్ మైన్లు, టీవీ బాంబులు, కారు బాంబులను ఈ జిల్లాకు పరిచయం చేసిన ఘటనలు ఉన్నాయంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

కొన్నిరోజుల కిందట కూడా మాధవ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జిల్లాలో పొలాలకు నీళ్లు లేని సమయంలో పరిటాల రవి రక్తం మరకలతో పొలాలను తడిపాడని అన్నారు. ఆ రక్తపు మరకలను తుడిచేందుకే సీఎం జగన్ ఇప్పుడు జిల్లాకు నీళ్లు ఇస్తున్నారని తెలిపారు. దీనిపై పరిటాల సునీత స్పందిస్తూ, మాధవ్ వ్యాఖ్యల వెనుక మరెవరైనా ఉన్నారేమోనని అన్నారు.

More Telugu News