Jagan: ఏలూరులో అస్వస్థతకు గురైన వారి వైద్య పరీక్షలపై సీఎం జగన్ ఆరా

  • ఏలూరులో అదుపులోకి రాని వింతవ్యాధి
  • పెరుగుతున్న బాధితుల సంఖ్య
  • అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం జగన్
  • బాధితుల నమూనాల్లో సీసం, నికెల్ ఉన్నాయన్న అధికారులు
  • వివరాలు నివేదిక రూపంలో సమర్పించాలన్న సీఎం
CM Jagan asks officials testing details of Eluru victims

గతంలో ఎన్నడూ లేనంతగా ఓ వ్యాధి అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాన్ని హడలెత్తిస్తున్న వైనం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఆ వ్యాధి ఏంటన్నది తెలియకపోగా, బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో, ఏలూరులో అస్వస్థతకు గురైన వారికి నిర్వహిస్తున్న వైద్య పరీక్షలపై సీఎం జగన్ ఆరా తీశారు. పరీక్షల వివరాలను సీఎంవో అధికారులు సీఎం జగన్ కు తెలిపారు.

ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. బాధితుల నమూనాల్లో సీసం, నికెల్ వంటి మూలకాలు ఉన్నట్టు తెలిసిందని వివరించారు. ఐఐసీటీ కూడా పరీక్షలు చేస్తోందని, ఆ వివరాలు త్వరలో తెలుస్తాయని చెప్పారు. బాధితులకు మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలుపగా, ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైన అంశాలను నివేదిక రూపంలో ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. సీసం వంటి మూలకాలు శరీరాల్లోకి ఎలా చేరాయో పరిశీలించాలని సూచించారు. అస్వస్థతకు దారితీసిన కారణాలు, మార్గాలను గుర్తించాలని స్పష్టం చేశారు. రేపు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

కాగా, ఏలూరు వింత వ్యాధి అంశంపై సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా స్పందించారు. ఏలూరు నుంచి 15 మంది రక్త నమూనాలు వచ్చాయని వెల్లడించారు. వాంతులు, విరేచనాలకు సంబంధించిన నమూనాలు అడిగామని వివరించారు. ఆ నమూనాలు కూడా వస్తే అన్ని రకాల బ్యాక్టీరియాలు, వైరస్ లకు సంబంధించిన పరీక్షలు చేపడతామని మిశ్రా తెలిపారు. అయితే పరీక్షల నివేదికలు వచ్చేందుకు వారం రోజుల సమయం పడుతుందని స్పష్టం చేశారు.

More Telugu News