USA: హెచ్1బీ వీసాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఫేస్ బుక్ పై దావా

  • ఫేస్ బుక్ వివక్ష ప్రదర్శిస్తోందన్న అమెరికా ప్రభుత్వం
  • ఉద్దేశపూర్వకంగానే అమెరికన్లను నిరాకరిస్తోందంటూ ఆరోపణలు
  • అమెరికా న్యాయవిభాగానికి సహకరిస్తామన్న ఫేస్ బుక్
US Department of Justice sues Facebook

అమెరికన్లపై వివక్ష ప్రదర్శిస్తూ, హెచ్1బీ వీసాదారులు, తాత్కాలిక ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తోందంటూ ఫేస్ బుక్ పై అమెరికా న్యాయ విభాగం తీవ్ర ఆరోపణలు చేసింది. కొన్ని సందర్భాల్లో సాలీనా 1.56 లక్షల డాలర్ల సగటు వేతనం చెల్లించే 2,600 ఉద్యోగాల కోసం అమెరికన్లను ఫేస్ బుక్ నిరాకరిస్తోందని, అందుకు బదులుగా తాత్కాలిక వీసాదారులు, ముఖ్యంగా హెచ్1బీ వీసాదారులతో ఉద్యోగాలు భర్తీ చేస్తోందని యూఎస్ న్యాయ విభాగం వెల్లడించింది.

అర్హులైన అమెరికన్లకు మొండిచేయి చూపేలా ఫేస్ బుక్ ఉద్దేశపూర్వకంగానే ఓ నియామక విధానాన్ని రూపొందించి అమలు చేస్తోందని తెలిపింది. అంతేకాకుండా, శాశ్వత నివాసం కల్పించే గ్రీన్ కార్డులు కోరుకుంటున్న తాత్కాలిక వీసాదారులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ఫేస్ బుక్ పై న్యాయస్థానంలో దావా వేసింది.

దీనిపై ఫేస్ బుక్ ప్రతినిధి డేనియల్ రాబర్ట్స్ స్పందిస్తూ, అమెరికా న్యాయ విభాగానికి ఫేస్ బుక్ సహకరిస్తుందని, ఆరోపణలకు బదులిస్తామని తెలిపారు. ఈ వ్యవహారం న్యాయస్థానంలో ఉన్నందున ఇంతకుమించి స్పందించలేమని అన్నారు.

More Telugu News