NivarCyclone: నివర్ తుపాను దెబ్బకు చిత్తూరు జిల్లాలో పెళ్లి వాయిదా

  • శుక్రవారం జరగాల్సిన పెళ్లి
  • నివర్ ప్రభావంతో పరవళ్లు తొక్కిన పాపేపల్లి వాగు
  • వాగు అవతలే నిలిచిపోయిన అమ్మాయి తరఫు వర్గం
Nivar cyclone stops a wedding in Chittoor district

నివర్ తుపాను రైతులపైనే కాకుండా, చిత్తూరు జిల్లాలో ఓ యువజంట పెళ్లి వేడుకపైనా ప్రభావం చూపింది. నివర్ దెబ్బకు ఏకంగా పెళ్లే వాయిదా పడింది. చిత్తూరు జిల్లా పాపేపల్లికి చెందిన యువతికి దేవరాజుపల్లెకు చెందిన కుర్రాడితో వివాహం నిశ్చయమైంది. గట్టులోని శ్రీవెంకటరమణస్వామి కల్యాణమండపంలో శుక్రవారం ఉదయం ఐదింటికి ముహూర్తం. అంతకుముందు రోజు రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కోసం పాపేపల్లి నుంచి అమ్మాయి తరఫు వారు రెండు బస్సుల్లో గట్టు బయల్దేరారు.

అయితే, నివర్ తుపాను విజృంభణతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చిత్తూరు జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాలతో పాపేపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. దాంతో అమ్మాయి తరఫు వారి బస్సులు వాగు ఒడ్డునే నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం పెళ్లి ముహూర్తం సమీపిస్తున్న వేళలోనూ వాగు ప్రవాహ తీవ్రతలో ఏ మార్పు లేకపోవడంతో అమ్మాయి వర్గం ఉసూరుమంటూ వెనుదిరిగింది. చేసేది లేక వివాహం వాయిదా వేశారు. అబ్బాయి తరఫు వారికి ఫోన్ చేసి మరో ముహూర్తం నిర్ణయించి పెళ్లి చేద్దామని చెప్పారు.

More Telugu News