Haryana: సరిహద్దుల్లో మకాం వేసిన వేలాది మంది పంజాబ్ రైతులు... తీవ్ర ఉద్రిక్తత!

  • పంజాబ్ రైతులను సరిహద్దుల వద్ద నిలిపివేసిన హర్యానా
  • ఎలాగైనా వెళ్లి తీరతామంటున్న రైతులు
  • దాదాపు రెండు లక్షల మంది రావడంతో ఉద్రిక్తత
  • హస్తినలో నిరసనలకు అనుమతి లేదన్న ప్రభుత్వం
Punjab Farmers Camp at Haryana Border

పంజాబ్ కు చెందిన వేలాది మంది రైతులు హర్యానా సరిహద్దుల వద్దకు చేరుకుని, ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హర్యానా పోలీసు శాఖ వీరిని అడ్డుకునేందుకు భారీ ఎత్తున బలగాలను మోహరించింది. మరోవైపు ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్ లతో పాటు కేరళ నుంచి కూడా రైతులు హస్తినకు చేరుకుని నూతన వ్యవసాయ చట్టాలకు నిరసనలు తెలియజేయాలని నిర్ణయించుకోవడం, ఢిల్లీలో ఎటువంటి ర్యాలీకి అనుమతులు ఇవ్వలేమని కేజ్రీవాల్ సర్కారు తేల్చి చెప్పడంతో సరిహద్దులు పంచుకుంటున్న గుర్గావ్, ఫరీదాబాద్ తదితర ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు.

పంజాబ్ తో నేడు, రేపు సరిహద్దులను మూసివేస్తున్నామని, బస్సులు కూడా తిరగబోవని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. రైతులు నిరసనలకు దిగితే అడ్డుకోవడానికి బారికేడ్లు, వాటర్ క్యానన్లు, ఇతర వాహనాలను సిద్ధం చేశామని, నిషేధాజ్ఞలు ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి నిరసనలకూ దిగరాదని ఆయన హెచ్చరించారు. హర్యానా ప్రభుత్వం సైతం బస్సు సర్వీసులను నిలిపివేసి, జాతీయ రహదారులపై స్తంభించిన ట్రాఫిక్ ను దారి మళ్లిస్తోంది.

ఇక గత రాత్రంతా హర్యానా సరిహద్దుల వద్ద మకాం వేసిన రైతులు, ఈ ఉదయం సరిహద్దు దాటి వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. దాదాపు రెండు లక్షల మంది రైతులు సరిహద్దుల్లో ఉన్నారని భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించింది. ఈ నిరసనల కోసం రైతులు ముందుగానే సర్వసన్నద్ధమై కూరగాయలు, ఇతర నిత్యావసరాలు, వంటచెరుకు తదితరాలను తీసుకుని వచ్చారు. చలి మరింతగా పెరిగే అవకాశాలు ఉండటంతో గుడారాలు వేసుకునేందుకు టార్పాలిన్, బ్లాంకెట్లనూ వెంట తెచ్చుకున్నారని, ఎన్ని రోజులైనా వెనుదిరిగేది లేదని రైతు సంఘాల ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

More Telugu News