Pawan Kalyan: మోదీ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం: పవన్ కల్యాణ్

  • బీహార్ ఎన్నికల్లో బీజేపీ హవా
  • రాష్ట్రాల ఉప ఎన్నికల్లోనూ కమలం జోరు
  • మోదీ పాలనే కారణమన్న పవన్ కల్యాణ్
  • కేంద్రం విధానాలతో ఓటర్లు ప్రభావితమయ్యారని వెల్లడి
Pawan Kalyan says voters of Bihar and other states count on Modi ruling

బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు అనేక రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ గాలి వీయడం పట్ల జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీయే కూటమి సాధించిన విజయాలకు కారణం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకమేనని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం జాతీయ దృక్పథంతో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని చేపడుతున్న కార్యక్రమాలు ఈ విజయాల వెనుక కీలకాంశాలుగా నిలిచాయని పేర్కొన్నారు.

బీహార్ లో సుదీర్ఘకాలంగా పాలన చేస్తున్న ఎన్డీయే కూటమి మరోసారి ప్రజా విశ్వాసాన్ని పొందిందని, తెలంగాణలో దుబ్బాకతో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు పొందడానికి మోదీ పాలనే కారణమని వివరించారు.

ఆత్మనిర్భర్ భారత్ కార్యాచరణతో పాటు, భిన్న వర్గాల వారిని బలోపేతం చేసేందుకు కేంద్రం తీసుకువచ్చిన పథకాలు సగటు ఓటర్లను ఆలోచింపచేశాయని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దేశ సమైక్యత కోసం చేస్తున్న కృషి, అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రణాళికబద్ధ విధానాలతో నవతరం ఓటర్లు ప్రభావతం అయ్యారని తెలిపారు.

More Telugu News