Ajim Premji: ఇంతటి దానకర్ణుడు మరొకరు లేరయా..!

  • ఎడెల్ గైవ్ హురూన్ ఇండియా జాబితా విడుదల
  • అత్యధిక విరాళాలతో నెంబర్ వన్ గా అజీమ్ ప్రేమ్ జీ
  • ముఖేశ్ అంబానీకి మూడోస్థానం
Ajim Premji topped the chart of Indian Philanthropists

సంపాదించడం ఒకెత్తయితే, సమాజ హితం కోరి ఆ సంపాదనను దాతృత్వ సేవలకు వినియోగంచడం మరో ఎత్తు. ఈ విధంగా చూస్తే విప్రో అధినేత 75 ఏళ్ల అజీమ్ ప్రేమ్ జీ ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తారు. గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి. ఎడెల్ గైవ్ హురూన్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యధిక విరాళాలు అందించిన వారిలో అజీమ్ ప్రేమ్ జీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన ఈ ఏడాది రూ.7,904 కోట్లను చారిటీలకు విరాళంగా ఇచ్చారు.

దాతృత్వానికి మరోపేరులా నిలిచే ప్రేమ్ జీ విప్రోలో తన 34 శాతం వాటాలను సమాజ సేవ కోసం 'అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్'కు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ వాటాల విలువ రూ.52,750 కోట్లు.

కాగా, ఎడెల్ గైవ్ హురూన్ ఇండియా జాబితాలో ప్రేమ్ జీ తర్వాత రెండోస్థానంలో హెచ్ సీఎల్ అధినేత శివ్ నాడార్, మూడో స్థానంలో రిలయన్స్ కింగ్ ముఖేశ్ అంబానీ, నాలుగో స్థానంలో బిర్లా దిగ్గజం కుమార మంగళం బిర్లా, ఐదో స్థానంలో వేదాంత గ్రూపు అనిల్ అగర్వాల్ ఉన్నారు. 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య కాలంలో ఇచ్చిన విరాళాల ఆధారంగా ఈ జాబితా రూపొందించారు.

ఈ ఏడాది 112 మందికి ఈ జాబితాలో స్థానం కల్పించారు. అత్యధిక విరాళాలు ఇచ్చిన మహిళగా రోహిణి నీలేకని, పిన్నవయసు దాతృత్వకర్తగా బిన్నీ బన్సాల్ (40 ఏళ్ల లోపు వయసు) ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు.

More Telugu News