Virat Kohli: జనవరిలో ప్రసవించనున్న అనుష్క!.... ఆసీస్ పర్యటన మధ్యలో భారత్ వచ్చేందుకు కోహ్లీకి అనుమతి

  • మరోసారి సమావేశమైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ
  • గాయాల పాలైన ఆటగాళ్ల పరిస్థితిపై చర్చ
  • రోహిత్ శర్మ టెస్టుల్లో ఆడతాడని వెల్లడి
  • అదనపు వికెట్ కీపర్ గా సంజూ శాంసన్
Virat Kohli will return India after first test in Australia

టీమిండియా త్వరలోనే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఇటీవలే మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించారు. అయితే, ఐపీఎల్ లో పలువురు ఆటగాళ్లకు గాయాలైన నేపథ్యంలో బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ మరోసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీకి పితృత్వపు సెలవు మంజూరు చేశారు. కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతి. ఆమె 2021 జనవరిలో ప్రసవిస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లీ ఆసీస్ టూర్ లో తొలి టెస్టు తర్వాత భారత్ తిరిగి రానున్నాడు. ఈ మేరకు కోహ్లీకి బీసీసీఐ నుంచి అనుమతి లభించింది.

ఇక, ఆసీస్ టూర్ కు రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై వచ్చిన విమర్శలతో బీసీసీఐ సెలెక్షన్ బృందం కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. వన్డే, టీ20 సిరీస్ లకు విశ్రాంతినిచ్చి, టెస్టు జట్టులో రోహిత్ కు స్థానం కల్పిస్తూ నేటి సమావేశంలో నిర్ణయించింది. ఐపీఎల్ లో రోహిత్ కు అయిన గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ నిశితంగా పర్యవేక్షిస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు.

యువ వికెట్ కీపింగ్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ పై సెలెక్టర్లు ఔదార్యం ప్రదర్శించారు. సీనియర్ కీపర్ సాహాకు గాయం నేపథ్యంలో సంజూను టీమిండియా వన్డే దళంలో అదనపు వికెట్ కీపర్ గా చేర్చారు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో గాయం నుంచి కోలుకుంటున్న ఇషాంత్ శర్మ మ్యాచ్ ఫిట్ నెస్ సాధిస్తే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం జట్టులో చేర్చుతామని సెలెక్టర్లు తెలిపారు.

కాగా, తన మిస్టరీ స్పిన్ తో ఐపీఎల్ లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన తమిళనాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి భుజం గాయంతో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో తమిళనాడుకే చెందిన యార్కర్ స్పెషలిస్ట్ టి.నటరాజన్ ను ఎంపిక చేశారు. నటరాజన్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున మెరుగైన బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు.

ఇక, సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కండరాల గాయంతో బాధపడుతున్నందున అతడి విషయంలో తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. యువ ఫాస్ట్ బౌలర్ కమలేశ్ నాగర్ కోటి అధిక బౌలింగ్ భారం కారణంగా ఉత్పన్నమైన సమస్యలతో సతమతమవుతున్నాడని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తెలిపింది. అతడికి మెడికల్ టీమ్ నుంచి సహకారం అందుతోందని, అందుకే జట్టు వెంట ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడంలేదని వివరించింది.

More Telugu News