Rajya Sabha: రాజ్యసభలో సెంచరీ కొట్టిన ఎన్డీయే...చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ఠానికి కాంగ్రెస్ బలం!

  • ప్రస్తుతం సభలో సభ్యులు 242 మంది  
  • 100కు చేరిన ఎంపీల సంఖ్య
  •  కాంగ్రెస్ బలం 38 మాత్రమే
  • ఎన్డీయేకు మద్దతుగా పలు పార్టీలు
NDA Strength Crossed 100 Mark in Rajyasabha

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే బలం రాజ్యసభలో మరింతగా పెరిగింది. తొలిసారిగా ఎంపీల సంఖ్య విషయంలో సెంచరీ మార్క్ ను కొట్టింది. తాజాగా, సోమవారం నాడు కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి పెద్దల సభకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో బీజేపీ ఈ ఘనతను సాధించగా, ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బలం చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం 242 మంది సభ్యులున్న రాజ్యసభలో కాంగ్రెస్ బలం 38 మాత్రమే కావడం గమనార్హం.

ఇక ఇటీవల ఖాళీ అయిన 11 రాజ్యసభ స్థానాల్లో 10 ఉత్తరప్రదేశ్, ఒకటి ఉత్తరాఖండ్ నుంచి ఉండగా, 9 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. రాజ్యసభలో బీజేపీకి ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలైన ఆర్పీఐ, అసోం గణ పరిషత్, మిజో నేషనల్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, పట్టాలీ మక్కల్ కచ్చి, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ వంటి పార్టీల మద్దతు కూడా ఉందన్న సంగతి తెలిసిందే. ఈ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులున్నారు.

మరో నలుగురు నామినేటెడ్ సభ్యుల బలం కూడా కలుపుకుంటే, మొత్తం 104 మంది అధికారపక్షం వైపున్నట్టు. రాజ్యసభలో పూర్తి బలం కావాలంటే, 121 మంది ఎంపీలుండాలి. 2021 ముగిసేలోగా మిగిలిన 17 మందినీ బీజేపీ పొందే అవకాశాలు పుష్కలం. పూర్తి బలం లేకపోయినా, ఎన్డీయేకు అన్నాడీఎంకేకు చెందిన 9 మంది, బీజేడీకి చెందిన తొమ్మిది మంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురి మద్దతు లభిస్తుండటంతో, బిల్లులకు ఆమోదం విషయంలో అడ్డంకులు ఏర్పడటం లేదు.

More Telugu News