ICET Results: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల... ఈ ఏడాది 90.28 శాతం ఉత్తీర్ణత

  • ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్
  • పరీక్షకు హాజరైన వారి సంఖ్య 45,975
  • 41,506 మంది అర్హత
Telangana ICET results released

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 45,975 మంది పరీక్ష రాయగా, 41,506 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది ఐసెట్ లో 90.28 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ఆయన ఇవాళ ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మొత్తం 58,392 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం కోల్పోకూడదన్న ఉద్దేశంతో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఐసెట్ పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించామని పాపిరెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభణ పరిస్థితుల్లోనూ బాగా చదివి అర్హత సాధించారంటూ విద్యార్థులను అభినందించారు.

కాగా, హైదరాబాద్ ఎస్సార్ నగర్ కు చెందిన శుభశ్రీ 159.5 మార్కులతో ఐసెట్ టాపర్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా ఆర్మూర్ కు చెందిన జి.సందీప్ (144.50), హైదరాబాద్ ఈసీఐఎల్ కు చెందిన అవినాశ్ సిన్హా (142.43), వరంగల్ కు చెందిన ప్రసన్నలక్ష్మి (142), రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన శ్రీకృష్ణసాయి (141.40) టాప్-5లో ఉన్నారు.

More Telugu News