Andhra Pradesh: ఏపీలో తెరచుకున్న బడులు... మార్గదర్శకాలు ఇవే!

  • 3 నుంచి అన్ని తరగతులకూ క్లాసులు
  • 180 రోజుల పాటు తరగతులు
  • సెలవుల్లో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఇంటి వద్ద క్లాసులు
  • హాస్టళ్లు తక్షణం తెరవాలన్న ఏపీ ప్రభుత్వం
Guidelines for Schools in AP

సుమారు 8 నెలల తరువాత, ఆంధ్రప్రదేశ్ లో నేడు బడులు తెరచుకున్నాయి. కరోనా నేపథ్యంలో, మార్చిలో మూతపడిన పాఠశాలలను, పకడ్బందీగా మార్గదర్శకాలను అనుసరిస్తూ, తిరిగి తెరవాలన్న ఉద్దేశంతో ఉన్న వైఎస్ జగన్ సర్కారు, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఈ సంవత్సరం 180 రోజుల పాటు తరగతులను నిర్వహించాలని, నేటి నుంచి ఏప్రిల్ 30 వరకూ ఉన్న పనిదినాల్లో 144 రోజులు బడుల్లో బోధన, మిగిలే సెలవు, ఆదివారాల్లో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఇళ్ల వద్దే చదువుకునేలా చూడాలని నిర్ణయించింది.

లాక్ డౌన్ కారణంగా గత సంవత్సరం పరీక్షలు లేకుండానే, విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఇక, ఇదే సమయంలో పట్టణాలు, నగరాల్లో ఉండలేక, తమ స్వస్థలాలకు వెళ్లిపోయిన వలస కార్మికుల పిల్లలకు ఇబ్బందులు కలిగించరాదని, వారు వస్తే, తక్షణం పై తరగతుల్లో ప్రవేశం కల్పించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. పిల్లలు, టీచర్లు, ఇతర సిబ్బంది ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని, పాఠశాల పరిశుభ్రత విషయంలో రాజీ పడరాదని పేర్కొంది. ఇందుకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జిల్లా విద్యా శాఖ అధికారులకూ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వ తాజా మార్గదర్శకాలను పరిశీలిస్తే, ఈ నెలాఖరు వరకూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ మాత్రమే తరగతులు నిర్వహించాలి. నవంబర్ నెలాఖరులో నెలకొన్న పరిస్థితులను సమీక్షించిన తరువాత, డిసెంబర్ స్కూళ్ల తరగతుల సమయంపై నిర్ణయం తీసుకుంటారు. ఇక ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించి విద్యార్థులు ఉండరాదు. వారంతా కనీసం 6 అడుగుల దూరం పాటించాలి. ఇదే సమయంలో స్టూడెంట్స్ సంఖ్య 750 దాటితే, మూడు రోజులకు ఒకసారి మాత్రమే వారు హాజరయ్యేలా చూడాలి.

ఉపాధ్యాయులు మాత్రం నిత్యమూ పాఠశాలకు రావాల్సి వుంటుంది. వార్షిక క్యాలెండర్ ను అనుసరిస్తూ, తరగతులను నిర్వహించాల్సి వుంటుంది. స్కూలుకు వచ్చిన ప్రతి విద్యార్థికీ, పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించాలి. 3 నుంచి 5 తరగతుల విద్యార్థులు కూడా స్కూళ్లు దగ్గరగా ఉంటే తరగతులకు హాజరు కావచ్చు. ఇక, 9 నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు నేటి నుంచే హాస్టళ్లలోకి ప్రవేశం కల్పించాలి. ఒకవేళ హాస్టళ్లు సిద్ధం కాకుంటే, 23 లోపు వాటిని పూర్తి స్థాయిలో తెరవాలి.

More Telugu News