Ambati Rambabu: మాపై ఎన్నికల సంఘం చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి: అంబటి రాంబాబు

  • ఈసీ సమావేశానికి హాజరుకాబోమని నిన్ననే చెప్పాం
  • స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం వెనుక కుట్ర ఉంది
  • ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు
EC comments are ridiculous says Ambati Rambabu

సీఈసీ నిమ్మగడ్డ రమేశ్ నిర్వహించే సమావేశానికి తమ పార్టీ తరపున ఎవరూ వెళ్లబోమనే విషయాన్ని నిన్ననే చెప్పామని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాము చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని చెప్పారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని నిమ్మగడ్డ ఒక పార్టీకి తాకట్టు పెట్టారని విమర్శించారు.

గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినప్పుడు రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్నికలను వాయిదా వేయడం వెనుక ఒక కుట్ర దాగుందని చెప్పారు. అప్పుడు పార్టీల అభిప్రాయాలను తీసుకోని నిమ్మగడ్డ రమేశ్ ఇప్పుడెందుకు పార్టీలతో మీటింగ్ పెట్టారని ప్రశ్నించారు.

ఏదైనా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పిందని రాంబాబు తెలిపారు. రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయంపై సమావేశాన్ని ఏర్పాటు చేయడం కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వంతో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు.

 స్థానిక ఎన్నికలను వాయిదా వేసేటప్పుడు రాష్ట్రంలో కేవలం మూడు, నాలుగు కరోనా కేసులు మాత్రమే ఉన్నాయని... ఇప్పుడు 3 వేల కేసులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నది ఎన్నికల కమిషన్ కాదని... చంద్రబాబు నిమ్మగడ్డ కమిషన్ అని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎన్ని మాటలు అన్నారని మండిపడ్డారు. డబ్బు, మద్యం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టంతో మీకేమి సంబంధమని అంబటి ప్రశ్నించారు.

కరోనా సెకండ్ వేవ్ రాబోతోందనే హెచ్చరికలు ఉన్నాయని రాంబాబు చెప్పారు. కరోనా తగ్గిన తర్వాతే ఎన్నికలను నిర్వహించాలని అన్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి, మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని టీడీపీ డిమాండ్ చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీదే గెలుపని అన్నారు.

More Telugu News