Pawan Kalyan: నేతలు, వ్యాపారులతో పోల్చితే సినిమా వాళ్ల వద్ద ఉన్న సంపద ఎంత?: తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పవన్ కల్యాణ్

  • విపత్తు విరాళాలపై పవన్ తీవ్రస్థాయిలో స్పందన
  • సినీ పరిశ్రమ సున్నితమైనదని వెల్లడి
  • అందుకే సులువుగా టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యలు
  • విరాళాలు ఎవరికి వారు స్పందించి ఇవ్వాలన్న పవన్
  • ఎందుకు ఇవ్వలేదని అడగడానికి వీల్లేదని స్పష్టీకరణ
Pawan Kalyan asks politicians donate huge amounts

ఎన్నికల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే నాయకులు వరద బాధితుల కోసం ఆ సొమ్ము బయటికి తీయాలంటూ జనసేనాని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. నేతలు, వ్యాపారులతో పోల్చితే సినిమా వాళ్ల వద్ద ఉన్న సంపద ఎంత? అని వ్యాఖ్యానించారు. విపత్తులు సంభవించిన ప్రతిసారి సినీ పరిశ్రమ స్పందిస్తూనే ఉందని స్పష్టం చేశారు.

అయినా సినిమా పరిశ్రమ సరిపోయినంత ఇవ్వడంలేదని అంటున్నారని, ఎంత ఇవ్వాలో నిర్ధారించేది ఎవరు? ఆలా నిర్ధారించేవాళ్లు తమ జేబుల్లోంచి పది రూపాయలైనా తీసి ఇచ్చారా? కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బు నుంచి కోటి రూపాయలు, రూ.10 లక్షలు ఇవ్వాలంటే వారికి మనసొప్పుతుందా? అని ప్రశ్నించారు.

నా వరకు నేను కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాను. అలా ఇవ్వాలంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి. ఇండస్ట్రీలో పేరు ఉన్నంతగా డబ్బు ఉండదు. ఆరెంజ్ సినిమాకు నష్టం వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. అత్తారింటికి దారేది చిత్రం విడుదలకు ముందే ఆన్ లైన్ లో పైరసీకి గురైతే కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు, గ్యారంటీ పత్రాలపై సంతకాలు చేసి రిలీజ్ చేయాల్సి వచ్చింది అని ఆక్రోశించారు.

"సినీ రంగంలోని వారికి పేరేమో ఆకాశమంత ఉంటుంది, కానీ డబ్బు ఆ స్థాయిలో ఉండదు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా ఇక్కడ వేల కోట్ల టర్నోవర్ రాదు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వందల కోట్లలో ఖర్చు చేస్తారు... ఆ స్థాయిలో డబ్బులు చిత్ర పరిశ్రమలో ఉండవు. వాస్తవానికి డబ్బంతా రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద, రాజకీయ నేతలు, రాజకీయ వ్యవస్థలు, ఎగుమతి వ్యాపారాలు చేసే పారిశ్రామికవేత్తల వద్ద, ఇన్ ఫ్రా రంగంలో ఉండే సంస్థలు, కాంట్రాక్టర్ల వద్ద ఉంది. వాళ్లతో పోల్చితే సినీ రంగం ఏపాటిది?

ఒక్కో సీజన్ లో అన్ని సినిమాలు కలిపినా వెయ్యి కోట్లు కూడా ఉండదు. ఒక వ్యక్తి సినిమా పరిశ్రమలో రూ.1 కోటి సంపాదిస్తే కొంత జీఎస్టీ ద్వారా పోతుంది. అన్ని పన్నులు పోయి చేతిలో మిగిలేది రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షలే. నష్టం వస్తే ఆ డబ్బు కూడా మిగలదు. జీవితాలు కోల్పోయిన వాళ్లు ఉన్నారు ఇక్కడ. కరోనా వేళ నేను కోటి రూపాయలు ఇస్తే, అక్షయ్ కుమార్ రూ.25 కోట్లు ఇచ్చారు. అది ఆయన స్థాయి. అందులో ఎలాంటి మెహర్బానీ లేదు.

విరాళం అనేది ఎవరికి వారు స్పందించి ఇవ్వాలే తప్ప, మీరు ఎందుకు ఇవ్వడంలేదని అడగడానికి వీల్లేదు. చిత్ర పరిశ్రమ ఎంతో సున్నితమైనది కాబట్టే ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల వేళ వందల కోట్ల రూపాయలు భారీగా ఖర్చు చేస్తున్నారు. అలాంటివాళ్లందరూ ఇప్పుడు డబ్బులు బయటికి తీయాలి. వారి నియోజకవర్గాల్లో ఎన్నికల కోసం ఖర్చు పెడుతున్నాం అనుకుని వరద బాధితుల కోసం ఖర్చు చేయాలి" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

More Telugu News