CMRF: సీఎం రిలీఫ్ ఫండ్ కు నాగ్, విజయ్ దేవరకొండ సహా పలువురు సినీ ప్రముఖుల విరాళాలు!

  • వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తున్న సినీ ప్రముఖులు
  • రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన నాగార్జున
  • రూ. 10 లక్షలు డొనేట్ చేసిన విజయ్ దేవరకొండ
Nagarjuna and Vijay Devarakond contributes to CM relief fund

భారీ వర్షాల కారణంగా హైదరాబాదులోని పలు కాలనీలు జలమయమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 32 వేలకు పైగా కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామని నిన్న మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నగరానికి జరిగిన పూర్తి నష్టాన్ని ఇంకా అంచనా వేయాల్సి ఉంది.

మరోవైపు, వరద బాధితులను ఆదుకోవడానికి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలంగాణకు ఆర్థికసాయం ప్రకటిస్తున్నాయి. ఇంకోవైపు మేము సైతం అంటూ సినీ ప్రముఖులు కూడా ఆపన్నులను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. సినీ నటులు నాగార్జున, విజయ్ దేవరకొండ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలను ప్రకటించారు.

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయని నాగార్జున అన్నారు. తక్షణ పునరావాస కార్యక్రమాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 550 కోట్లు విడుదల చేయడం సంతోషకరమని చెప్పారు. ఈ విపత్తు సమయంలో బాధితులను ఆదుకోవడానికి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు ఇస్తున్నాను అని ప్రకటించారు.

ఈ ఏడాది మొత్తం చాలా ఇబ్బందికరంగా గడుస్తోందని విజయ్ దేవరకొండ ఆవేదన వ్యక్తం చేశాడు. కష్ట సమయంలో చాలా మంది తమ వంతు సహాయసహకారాలను అందించారని... ఇప్పుడు మరోసారి మనమంతా వరద బాధితులను ఆదుకోవడానికి ఆర్థిక సాయం చేద్దామని పిలుపునిచ్చాడు. తన వంతు సాయంగా సీఎం రీలీఫ్ ఫండ్ కు రూ. 10 లక్షలు ఇస్తున్నానని తెలిపాడు.

మరోవైపు దర్శకులు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ కూడా బాధితులకు అండగా తాము కూడా ఉన్నామన్నారు. చెరొక రూ. 5 లక్షల వంతున సీఎం రిలీఫ్ ఫండ్ కు డొనేట్ చేస్తున్నట్టు ప్రకటించారు.

More Telugu News