Smell: కరోనాను గుర్తించడంలో ఈ రెండు లక్షణాలే కీలకం: లండన్ పరిశోధకులు

  • రుచి, వాసన తెలియకపోతే కరోనా కావొచ్చని వెల్లడి
  • పరిశోధన జరిపిన యూనివర్సిటీ కాలేజ్ లండన్
  • ఉల్లి, వెల్లుల్లి వాసనలు తెలియకపోతే టెస్టు చేయించుకోవాలన్న నిపుణులు
Researchers says smell and taste deficiency could be corona

కరోనా వైరస్... చైనాలో పుట్టిన ఈ రాకాసి వైరస్ ప్రపంచానికి పూర్తిగా కొత్త. తొలినాళ్లలో దీనికి నిర్దిష్ట వైద్య విధానం గానీ, దీని లక్షణాలపై స్పష్టమైన అవగాహన గానీ లేదు. అయితే క్రమంగా పరిశోధకులు, వైద్య నిపుణులు కరోనా వైరస్ ను నిశితంగా అర్థం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో యూనివర్సిటీ కాలేజ్ లండన్ కు చెందిన పరిశోధకులు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కరోనా సోకిన వ్యక్తి కొన్నిరోజుల పాటు వాసన, రుచి చూసే శక్తి కోల్పోతాడని ఇప్పటికే అనేక అధ్యయనాలు తెలిపాయి.

తాజాగా లండన్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో, ఈ రెండు లక్షణాలే కరోనా నిర్ధారణలో అత్యంత కీలకమని వెల్లడైంది. జ్వరం, జలుబు, దగ్గు కంటే వాసన, రుచి కోల్పోవడమే కరోనా వైరస్ కలిగించే లక్షణాల్లో ప్రధానమైనవని వీరు తేల్చారు. ఈ పరిశోధనలో భాగంగా రుచి, వాసన శక్తిని కోల్పోయిన 590 మందిని పరిశీలించారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 78 శాతం మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ చేశారు. 40 శాతం మందిలో జ్వరం, దగ్గు లేకపోగా, రుచి, వాసన శక్తి తగ్గినట్టు గుర్తించారు.

ఈ రెండు లక్షణాల ద్వారా కరోనా రోగులను త్వరగా గుర్తించేందుకు వీలుపడుతుందని, తద్వారా వైరస్ వ్యాప్తిని మరింత సమర్థంగా అడ్డుకోవచ్చని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ రేచెల్ బాటర్ హమ్ తెలిపారు. కరోనా సోకిందని అనుమానం ఉన్నవాళ్లు ఇంట్లో ఉండే వెల్లుల్లి, ఉల్లి, పెర్ఫ్యూమ్, కాఫీ వాసనలు గుర్తించేందుకు ప్రయత్నించాలని, వాటి వాసన తెలియకపోతే కరోనా టెస్టు చేయించుకోవాలని పరిశోధకులు వెల్లడించారు.

More Telugu News