Haryana: సరిహద్దుల వద్ద యూపీ రైతులను అడ్డుకున్న హర్యానా... కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా కదిలిన తొలి రాష్ట్రం!

  • పంటను ఎక్కడైనా అమ్ముకోవవచ్చంటున్న కొత్త చట్టం 
  • యూపీ కన్నా వరికి అధిక రేటు ఇస్తున్న హర్యానా మండీలు
  • యూపీ నుంచి రైతులు వస్తుంటే సరిహద్దుల్లో నిలిపివేత
  • తొలుత తమ రైతులకే ప్రాధాన్యమన్న అధికారులు
  • పోర్టలో నమోదు చేసుకుని వేచి చూడాలని ఆదేశం
UP Farmers Stopped at Haryana Border

కేంద్రం తాజాగా తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా హర్యానా నిలిచింది. ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న సుమారు 50 మంది ధాన్యం రైతులను కర్నాల్ వద్ద హర్యానా అధికారులు నిలిపివేశారు.

వ్యవసాయ చట్టం అమలులోకి వచ్చిన తరువాత, తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చన్న ఆలోచనతో, యూపీకి చెందిన రైతులు, రాష్ట్రాల సరిహద్దులను దాటాలని ప్రయత్నించడమే కారణమైంది. యూపీ ప్రభుత్వం ఇస్తున్న కనీస మద్దతు ధర తక్కువగా ఉన్న నేపథ్యంలో, పొరుగునే ఉన్న హర్యానాకు వెళ్లి, అక్కడి మండీల్లో (హోల్ సేల్ మార్కెట్లు) తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవాలని ప్రయత్నించారు.

వాస్తవానికి యూపీతో పోలిస్తే, హర్యానా ఇస్తున్న కనీస మద్దతు ధర అధికంగా ఉంది. దీంతో పలు రకాల ధాన్యం రకాలను తీసుకుని రైతులు సరిహద్దుల వద్దకు వచ్చారు. అప్పటికే సరిహద్దులు దాటి తమ పంటను తీసుకుని వచ్చే రైతులను అడ్డుకోవాలన్న ఆదేశాలు అందడంతో అధికారులు వాహనాలను అడ్డుకున్నారు. ఈ మేరకు కర్నాల్ డిప్యూటీ కమిషనర్ నిశాంత్ యాదవ్ ఆదేశాల మేరకు అడ్డుకున్నట్టు సరిహద్దు సిబ్బంది వెల్లడించారు.

ఈ విషయంలో స్పందించిన జిల్లా అధికారులు, ఇదే తరహా వెరైటీలకు చెందిన వరి పంటను స్థానిక రైతులు కూడా పండిస్తున్నారని, మండీల్లో వారికి తొలి ప్రాధాన్యతను ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేయడం గమనార్హం. ఈ తరహా నిర్ణయాలు తాము గతంలో కూడా తీసుకున్నామని, సరిహద్దుల్లో యూపీ రైతులను అడ్డుకోవడం ఇదే తొలిసారి కాదని వెల్లడించారు.అయితే, ప్రభుత్వం నిర్వహిస్తున్న పోర్టల్ లో నమోదు చేసుకుని, తమవంతు వచ్చే వరకూ వేచివుంటే, బాస్మతి మినహా మిగతా వెరైటీలను తమ రాష్ట్రంలో విక్రయించుకునేందుకు అనుమతిస్తామని ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.

ఈ విషయమై మరింత వివరణ ఇచ్చిన హర్యానా ఆహార, పౌర సరఫరాల శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి పీకే దాస్, "ఇతర రాష్ట్రాల రైతులు, మా రాష్ట్రంలోకి వచ్చి తమ ఉత్పత్తులను విక్రయించుకోవడాన్ని నిరోధించేలా ఏ చట్టమూ లేదు. అయితే, మేము ఓ వెబ్ పోర్టల్ ను నిర్వహిస్తున్నాం.అందులో వారి వివరాలను, వారు పండించిన పంట వివరాలను నమోదు చేసుకుని, తమవంతు వచ్చే వరకూ వేచి చూడాలి. కరోనా కారణంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకూ ఎస్ఎంఎస్ పంపుతాం. వారి వంతు వచ్చిన తరువాత మార్కెట్లోకి సరకుతో రావచ్చు" అని అన్నారు.

More Telugu News