Anil Ambani: నాకు విలాసాలు కూడానా... నగలు అమ్మి లాయర్ల ఫీజులు కడుతున్నా: కోర్టుకు తెలిపిన అనిల్ అంబానీ

  • రుణం ఎగవేసి లగ్జరీగా గడుపుతున్నారా అని అడిగిన కోర్టు
  • తాను చాలా నిరాడంబరమైన వ్యక్తినన్న అనిల్
  • తనకు ఓ చిన్నకారు మాత్రమే ఉందని వెల్లడి
Anil Ambani says he is a simple man

ఓవైపు అన్న ముఖేశ్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తూ కుబేరుల జాబితాలో నానాటికీ పైకెదుగుతుంటే, తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం రుణాల బారినపడి తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు. అనిల్ అంబానీ తమకు భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉందంటూ మూడు చైనా బ్యాంకులు లండన్ కోర్టులో కేసు దాఖలు చేయగా, నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు అడిగిన ప్రశ్నకు అనిల్ అంబానీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

చైనా బ్యాంకులకు అప్పు ఎగ్గొట్టి ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్టున్నారు అంటూ న్యాయమూర్తి అడగ్గా.... ఇంట్లో నగలు అమ్మితే వచ్చిన రూ.9.9 కోట్లతో లాయర్ల ఫీజులు చెల్లిస్తున్నానని వెల్లడించారు. తనకు ఓ చిన్న కారు మాత్రమే ఉందని, తనపై ఆరోపణలు వస్తున్నట్టుగా తనకు రోల్స్ రాయిస్ కారు లేదని స్పష్టం చేశారు. తాను చాలా నిరాడంబరమైన వ్యక్తినని, తన కోరికలు కూడా మామూలు స్థాయిలోనే ఉంటాయని వివరించారు.

తాను ఓ మారథాన్ రన్నర్ నని, మద్యం, ధూమపానం, జూదం వంటి వ్యసనాలకు ఎంతో దూరంగా ఉంటానని అనిల్ అంబానీ తెలిపారు. ఎంతో క్రమశిక్షణ ఉన్న వ్యక్తినని, తాను గతంలోనూ, ఇప్పుడైనా, భవిష్యత్తులోనైనా ఎంతో సంపన్న జీవితం గడపడం అనేది కేవలం ఊహాజనితమే అవుతుందని అన్నారు.

రిలయన్స్ గ్రూపు చైర్మన్ గా ఉన్న అనిల్ అంబానీ గతంలో తన నికర ఆస్తి విలువ సున్నా అని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆయన తన రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ ను ఆర్థిక సంక్షోభం నుంచి గటెక్కించేందుకు చైనా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి దాదాపు 700 మిలియన్ డాలర్లకు పైగా రుణాన్ని తీసుకున్నారు. ఈ రుణానికి ఆయనే పూచీకత్తు కావడంతో ఆ మూడు బ్యాంకులు లండన్ కోర్టును ఆశ్రయించాయి.

More Telugu News