Yadagirigutta: 'రాయగిరి' స్టేషన్ ఇక 'యాదాద్రి'... పేరును మార్చుతూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు!

  • అద్భుత క్షేత్రంగా తయారవుతున్న యాదాద్రి 
  • అత్యంత సమీపంలోని రైల్వే స్టేషన్ గా రాయగిరి
  • పేరు మార్చుతూ ఆదేశాలు
Rayagiri Railway Station Name Changed to Yadadri

తెలంగాణలో అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తయారవుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్న రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి రైల్వే స్టేషన్ గా మార్చుతూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ నిర్మాణం పూర్తయితే, దేశ నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో, స్టేషన్ అభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయి వసతుల కల్పనకు గతంలోనే కేసీఆర్ నిధులను మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

కాగా, సికింద్రాబాద్ నుంచి భువనగిరి తరువాత రాయగిరి రైల్వే స్టేషన్ ఉంటుంది. వాస్తవానికి ఈ స్టేషన్ లో ప్యాసింజర్ రైళ్లు మినహా మరే రైళ్లూ ఆగవు. అయితే, భవిష్యత్తులో ఈ రూట్లో వెళ్లే అన్ని రైళ్లకూ స్టాపింగ్ సౌకర్యం కల్పించేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో ప్రస్తుతం ఘట్ కేసర్ వరకూ ఉన్న ఎంఎంటీఎస్ ను రాయగిరి వరకూ పొడిగించాలని, అక్కడికి చేరే భక్తులను దాదాపు 6 కిలోమీటర్ల దూరంలోని యాదాద్రికి చేర్చేందుకు ప్రత్యేక బస్సులను కూడా నడపాలని నిర్ణయించింది.

ఇదిలావుండగా, గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ లో ఈ స్టేషన్ పేరును మారుస్తూ ఆదేశాలు జారీ కాగా, ఈ నెల 18వ తేదీతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు, పేరు మార్పును గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారికంగా రాయగిరి రైల్వే స్టేషన్ ఇకపై యాదాద్రి రైల్వే స్టేషన్ గా మారనుంది. ఈ మేరకు అన్ని సైన్ బోర్డులనూ మార్చే పనులు ప్రారంభం అయ్యాయి.

More Telugu News