Facebook: 'వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రత్యేక కథనంపై స్పందించిన ఫేస్ బుక్!

  • బీజేపీకి అనుకూలంగా ఉందంటూ వార్త
  • ప్రపంచమంతటా ఒకే విధానాన్ని పాటిస్తున్నాం
  • రెగ్యులర్ నియంత్రణ అమలవుతోంది
  • పార్టీలకు, వ్యక్తులకు మద్దతివ్వబోమన్న ఫేస్ బుక్
Facebook Reaction on Wall Street Journal Story

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, ఇండియాలో బీజేపీకి అనుకూలంగా ప్రవర్తిస్తోందని, ఆ పార్టీ నేతలు చేస్తున్న విద్వేషపూరిత ప్రసంగాలను విస్మరిస్తోందంటూ'వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రత్యేక కథనంపై సంస్థ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఏ పార్టీకిగానీ, ఎవరి రాజకీయ స్థాయిని గానీ, తాము పరిగణనలోకి తీసుకోబోమని, తమ విధి విధానాలు అందుకు అంగీకరించవని స్పష్టం చేసింది.

"విద్వేష పూరిత ప్రసంగాలకు సంబంధించి ఎటువంటి వీడియోలు వచ్చినా, కామెంట్లు వచ్చినా, వాటిని తీసివేస్తాం. ప్రపంచమంతా ఇదే తరహాలో ఒకే విధానాన్ని పాటిస్తున్నాం. పార్టీలను, వ్యక్తులను గుర్తించబోము. అయితే, ఈ విషయంలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని భావిస్తున్నాం. ఇందుకోసం రెగ్యులర్ నియంత్రణా విధానాన్ని అమలు చేస్తున్నాం. కచ్చితత్వం, నిజానిజాలే సోషల్ మీడియాలో ఉండాలన్నదే మా విధానం" అని పేర్కొంది.

కాగా, ఇప్పటికే ఈ విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీపై, ఫేస్ బుక్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ నేతలు ఏమి మాట్లాడినా, ఎంత విద్వేషంగా మాట్లాడినా, ఫేస్ బుక్ అనుకూలంగానే ఉంటోందని రాహుల్ ఆరోపించగా, అదే విషయాన్ని యూఎస్ మీడియా ప్రచురించడం కలకలం రేపడంతో, ఫేస్ బుక్ వివరణ ఇచ్చింది.

More Telugu News