India: భారత్ వ్యవహారాల్లో తలదూర్చడం పాక్ కు సరికాదు: కేంద్రం హితవు

  • అయోధ్యలో భూమి పూజపై పాక్ అక్కసు
  • ఆధిపత్య ధోరణి అంటూ వ్యాఖ్యలు
  • పాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదన్న భారత్
India warns Pakistan do not intervene

చారిత్రాత్మక రామ మందిరం నిర్మాణం కోసం నిన్న అయోధ్యలో భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ స్పందిస్తూ, అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం ఓ పొరపాటు నిర్ణయం అని పేర్కొంది. అంతేకాదు, భారత్ లో ప్రబలుతున్న ఆధిపత్య ధోరణికి ఇది నిదర్శనమని, ముస్లింలపైనా, వారికి సంబంధించిన ప్రార్థన స్థలాలపైనా దాడులు ఎక్కువవుతున్నాయని పాక్ విదేశాంగ శాఖ ఆరోపించింది. దీనిపై భారత్ వర్గాలు స్పందిస్తూ, పాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ఆశ్చర్యమేమీ లేదని పేర్కొన్నాయి.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, సరిహద్దుల ఆవల నుంచి ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ, స్వదేశంలోని మైనారిటీలను హక్కులకు దూరం చేసే పాకిస్థాన్ నోట ఇలాంటి మాటలు కొత్తేమీ కాదని పేర్కొన్నారు.

"భారత్ కు చెందిన ఓ అంతర్గత వ్యవహారంపై ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్ మీడియా ప్రకటనను మనం చూశాం. ఇకనైనా భారత్ వ్యవహారాల్లో తలదూర్చడం పాకిస్థాన్ మానుకోవాలి. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలి" అంటూ స్పష్టం చేశారు.

More Telugu News