Ayodhya Ram Mandir: అయోధ్యలో భూమి పూజ‌.. ప్రముఖుల స్పందన!

  • వేడుకను ప్ర‌త్య‌క్షంగా వీక్షించ‌డం అద్భుతం: రామ్‌దేవ్ బాబా
  • చిరస్థాయిగా గుర్తుంచుకోవాల్సిన విషయం: చిదానంద స‌ర‌స్వ‌తి 
  • పుణ్యాత్ములందరికీ శతథా సహస్రథా వందనం: మోహన్ బాబు
  • రామరాజ్యం వచ్చేస్తోంది: రాఘ‌వేంద్ర‌రావు  
celebs on rammadir

అయోధ్యలో రామ మందిర కల నెరవేరుతున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామ‌మందిర నిర్మాణ భూమిపూజ వేడుకను ప్ర‌త్య‌క్షంగా వీక్షించ‌డం అద్భుత‌మ‌ని యోగా గురు రామ్‌దేవ్ బాబా అన్నారు. భారత్‌లో రామ‌రాజ్య స్థాప‌న‌కు ఇది నాంది అని ఆయన చెప్పారు. ప్రస్తుతం యావ‌త్ ప్ర‌పంచం మొత్తం మన దేశాన్నే చూస్తోందని  స్వామి అవ‌దేశానంద గిరి చెప్పారు. ఇది చిరస్థాయిగా గుర్తుంచుకోవాల్సిన విషయం అని స్వామి చిదానంద స‌ర‌స్వ‌తి తెలిపారు. మనది వసుదైక కుటుంబం అని చెప్పారు.

పలువురు సినీ ప్రముఖులు కూడా రామమందిర నిర్మాణ కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'అయోధ్య రాముడు ఆనందించేలా.. భారతదేశం గర్వించేలా.. ప్రపంచ చరిత్ర చెప్పుకునేలా.. ఎదురులేని తిరుగులేని మొక్కవోని సాహసంతో.. పుణ్యకారం తలపెట్టిన పుణ్యాత్ములందరికీ శతథా సహస్రథా వందనం అభివందనం' అని సినీనటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు.

'భారతీయులందరి బంగారు కల నెరవేరుతున్న రోజు. శ్రీరామదాసు సినిమా దర్శకుడిగా నా జన్మ ధన్యం. జై శ్రీరామ్. రామరాజ్యం వచ్చేస్తోంది' అంటూ సినీ దర్శకుడు రాఘ‌వేంద్ర‌రావు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన 'శ్రీరామదాసు' సినిమాలో రాముడు భూమిపైకి వచ్చిన సీన్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.

బాలీవుడ్ ప్రముఖులు అనుప‌మ్ ఖేర్, కంగ‌నా ర‌నౌత్ కూడా రామ మందిరం భూమి పూజ‌పై స్పందిస్తూ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. కాగా, ఆయోధ్యలో రామ మందిర భూమిపూజ జరుగుతోంది. ఇందులో ప్రధాని మోదీతో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొంటున్నారు.

More Telugu News