Online games: ఆన్‌లైన్ గేములను ప్రచారం చేస్తున్న కోహ్లీ, తమన్నాలను అరెస్ట్ చేయండి: మద్రాస్ హైకోర్టులో పిటిషన్

  • ఆన్‌లైన్‌ గేములను ప్రచారం చేస్తూ యువత మరణానికి కారణం అవుతున్నారు
  • గ్యాంబ్లింగ్ మహమ్మారి సమాజానికి ప్రమాదకరం
  • గ్యాంబ్లింగ్ బారినపడి ఇటీవల 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య
Petition filed seeking Virat Kohli and Tamannaah arrest for promoting online gambling

ఆన్‌లైన్ గేమ్‌లకు ప్రచారం చేస్తూ పలువురి మరణాలకు కారణమవుతున్నారంటూ టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, ప్రముఖ నటి తమన్నాలకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తమిళనాడుకు చెందిన న్యాయవాది సూర్యప్రకాశం ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆన్‌లైన్ గేములు ఆడి నష్టపోతున్న వారు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు రాష్ట్రంలో పెరిగిపోయాయని, కాబట్టి ఈ గేములకు ప్రచారకర్తలుగా ఉన్న కోహ్లీ, తమన్నాలను అరెస్ట్ చేయాలని ఆ పిటిషన్‌లో డిమాండ్ చేశారు.

గ్యాంబ్లింగ్ మహమ్మారి సమాజానికి చాలా ప్రమాదకరమని, ఇది జీవించే హక్కును కాలరాస్తోందని, రాజ్యాంగంలోని 21వ అధికరణకు ఇది విరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆన్‌లైన్ గేముల నిర్వాహకులు భారీగా నగదు, బోనస్‌లు ప్రకటిస్తుండడంతో యువత ఈ వ్యసనం బారినపడి ప్రాణాలు తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కోహ్లీ, తమన్నాతోపాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఈ గేములను ప్రచారం చేస్తున్నారని వివరించారు. చెన్నైకి చెందిన 19 ఏళ్ల విద్యార్థి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడని, గ్యాంబ్లింగ్‌కు బానిస కావడం వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్‌లో రాశాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాబట్టి ఆయా సైట్ల నిర్వాహకులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలని న్యాయవాది సూర్యప్రకాశం తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, వచ్చేవారం కోర్టు ఈ పిటిషన్‌ను విచారించే అవకాశం ఉంది.

More Telugu News