CBI: వివేకా హత్యకేసులో రంగంలోకి దిగిన సీబీఐ... ఎస్పీ అన్బురాజన్ తో భేటీ

  • అప్పట్లో సంచలనం సృష్టించిన వివేకా హత్య
  • ఇప్పటికీ హంతకులెవరో తేలని వైనం
  • దర్యాప్తు బాధ్యతలు సీబీఐకి అప్పగించిన హైకోర్టు 
CBI starts investigation in YS Vivekananda Reddy murder case

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. సిట్, రాష్ట్ర పోలీసులు తీవ్రస్థాయిలో విచారణ జరిపినా హంతకులెవరన్నది తెలియరాలేదు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు ఆదేశించగా, నేడు సీబీఐ అధికారులు దర్యాప్తుకు శ్రీకారం చుట్టారు. కడప చేరుకున్న ఏడుగురు సీబీఐ అధికారులు ఎస్పీ అన్బురాజన్ ను కలిసి వివేకా హత్యకేసు వివరాలు తెలుసుకున్నారు. వివేకా హత్య జరిగిన పులివెందులకు కూడా వారు వెళ్లనున్నారు.

కాగా, ఇప్పటివరకు ఈ కేసును విచారించిన సిట్ కీలక రికార్డులను సీబీఐకి అప్పగించనుంది. ఈ కేసులో సిట్ 1,300 మందిని విచారించినా, ఏమాత్రం పురోగతి సాధించలేకపోయింది. ఏడాది కాలం అయినా ఈ కేసులో చిక్కుముడి వీడకపోవడాన్ని హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించే సమయంలో హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ హత్య ఘటన ఏపీకి మాత్రమే పరిమితం కాదనిపిస్తోందని, పరాయి రాష్ట్రాల వ్యక్తుల ప్రమేయం కూడా ఉండొచ్చని సందేహం వ్యక్తం చేసింది. అయితే ఇలాంటి కేసుల దర్యాప్తులో సమయం అన్నది ఎంతో ముఖ్యమైనదని, వీలైనంత త్వరగా దర్యాప్తు ముగించాలని సీబీఐకి నిర్దేశించింది.

More Telugu News