Vikas Dubey: కత్తులతో కూడా దారుణంగా పొడిచారు: దూబే గ్యాంగ్ హత్యచేసిన పోలీసుల పోస్ట్ మార్టం రిపోర్టులో సంచలన విషయాల వెల్లడి!

  • ఈ నెల ఆరంభంలో పోలీసులపై దాడి
  • మృతుల శరీరాలపై లోతైన గాయాలు
  • పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చారని వెల్లడి
Postmartam Report of Police who died in UP

ఈ నెల ఆరంభంలో యూపీలోని కాన్పూర్ కు సమీపంలోని బికారు గ్రామంలో తమను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసు బృందంపై గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే గ్యాంగ్ దాడి చేసి, ఎనిమిది మందిని పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆపై వారం రోజుల వ్యవధిలోనే వికాస్ దూబేను ఉజ్జయినిలో పట్టుకున్న పోలీసులు, మరుసటి రోజునే ఎన్ కౌంటర్ చేశారు.

ఇక ఎన్ కౌంటర్ విషయంలో వాస్తవాలు ఎలాగున్నా, దూబే గ్యాంగ్ హత్య చేసిన పోలీసుల మృతదేహాలకు పోస్ట్ మార్టం రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత తుపాకులతో కాల్చిన దూబే బృందం, ఆపై గాయపడిన పోలీసులపై పదునైన ఆయుధాలతో దాడి చేసిందని వైద్యుల నివేదిక వెల్లడించినట్టు తెలుస్తోంది.

పోలీసు బృందానికి నేతృత్వం వహించిన కమాండింగ్ ఆఫీసర్ మిశ్రా శరీరంలోకి నాలుగు బులెట్లు దిగడంతో పాటు, అతని శరీరంపై లోతైన కత్తి గాయాలు కూడా ఉన్నాయి. అతని తలకు ఓ బులెట్ తగిలిందని, మరొకటి గుండెల్లోకి, రెండు కడుపులోకి దూసుకెళ్లాయని ఈ రిపోర్టు పేర్కొంది. మిశ్రా  కాలును తెగనరికి, శరీరం నుంచి వేరుచేశారని పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. అన్ని బులెట్లూ పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చినవేనని వెల్లడించింది. ఈ దారుణ హత్యల తీరును చూస్తే, పోలీసులపై పగ తీర్చుకోవాలన్నా కసి దూబే గ్యాంగులో ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

అతనిలానే మిగతా ఏడుగురు పోలీసులూ దారుణంగా చంపబడ్డారని నివేదిక వెల్లడించింది. కాగా, వికాస్ దూబే పోలీసులపై జరిపించిన దాడి, దాని తరువాత అతని ఎన్ కౌంటర్ పై యూపీ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రిటైర్డ్ న్యాయమూర్తి శశికాంత్ అగర్వాల్ నేతృత్వంలో ఓ బృందాన్ని కూడా నియమించింది.

More Telugu News