Vijay Sai Reddy: రఘురామకృష్ణరాజు స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నారు... అందుకే అనర్హత పిటిషన్ ఇచ్చాం: విజయసాయిరెడ్డి

  • ఢిల్లీలో స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీలు
  • రఘురామకృష్ణరాజుపై ఫిర్యాదు
  • అన్ని విషయాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్న స్పీకర్  
Vijaysai Reddy slams Raghuramakrishna Raju

వైసీపీ ఎంపీలు రఘురామకృష్ణరాజు అంశంపై ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ తో భేటీ అనంతరం వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయడానికి వీలైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని స్పీకర్ ను కోరామని, అనర్హత పిటిషన్ ను సమర్పించామని వివరించారు. స్పీకర్ అన్ని విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు.

"ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అనేది ఓ పునాది వంటిది. రఘురామకృష్ణరాజు అలాంటి పునాదిని కదిలించే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూలదోసే విధంగా ప్రయత్నం చేశారు. ఏ పార్టీ టికెట్ తో ఆయన గెలిచారో, ఏ పార్టీ మేనిఫెస్టోతో ప్రచారం చేసుకుని గెలిచారో ఆ పార్టీకి అనుగుణంగా ఆయన నడుచుకోవడంలేదు. పార్టీ అధ్యక్షుడ్ని గౌరవించకపోవడం, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటి అనేక చర్యలకు పాల్పడ్డారు. సరిగ్గా చెప్పాలంటే రఘురామకృష్ణరాజు సొంతపార్టీలో విపక్షం లాంటి వారు. వైసీపీలో ఉంటూనే ఇతర పార్టీలతో మంతనాలు జరిపారు. అందుకే అనర్హత పిటిషన్ ను రూపొందించి స్పీకర్ కు ఇవ్వడం జరిగింది.

సొంతపార్టీలో ఉన్నవాళ్లను దూషిస్తూ, విపక్షాలతో లాలూచీ పడి దిగజారిపోయారు. ఊహాజనిత కారణాలను ప్రచారం చేయాలనుకున్నారు. ఏదైనా ఉంటే పార్టీ అధ్యక్షుడికి చెప్పుకోవాలి కానీ, బహిరంగంగా మాట్లాడాలనుకోవడం పార్టీ విధివిధానాలకు అనుగుణం కాదు. రఘురామకృష్ణరాజు ఆరోపణల్లో విశ్వసనీయత లేదు. రఘురామకృష్ణరాజు భౌతికంగా వైసీపీలో ఉన్నా, ఆయన హార్ట్ అండ్ సోల్ ఇక్కడ లేదు. మనసా వాచా కర్మణా పార్టీ కోసం పనిచేసేవాళ్లే వైసీపీకి కావాలి. అందుకే ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతున్నాం" అంటూ వివరణ ఇచ్చారు.

More Telugu News