Government Employs: ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సమస్య త్వరలోనే పరిష్కారమవుతుంది: అజేయ కల్లం

  • జూలై 1న విడుదల కాని వేతనాలు
  • నిరాశలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
  • రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందన్న కల్లం
Ajeaya Kallam explains the problem behind salaries delay

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు జూలై 1న జమ కాకపోవడంతో వేతనజీవులు నిరాశకు గురయ్యారు. దీనిపై ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లం వివరణ ఇచ్చారు. ద్రవ్య వినిమయ బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందకపోవడం ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలిపారు. గత నెల 30వ తేదీ వరకు ఆర్డినెన్స్ సాయంతో ఖర్చు పెట్టామని, కానీ శాసనమండలి సమావేశాల్లో ద్రవ్య బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో ఉద్యోగుల వేతనాలు ఆలస్యం అయ్యాయని వివరించారు. అయితే, రెండు, మూడు రోజుల్లో గవర్నర్ ఆమోదంతో సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.

రాజ్యాంగ ప్రొవిజన్ ప్రకారం... అసెంబ్లీలో ఆమోదం పొందిన ద్రవ్య బిల్లు శాసనమండలి ఆమోదానికి వెళ్లి తిరిగి అసెంబ్లీకి రాకపోతే... 14 రోజుల తర్వాతే దాన్ని అసెంబ్లీ కార్యదర్శి గవర్నర్ కు పంపే వీలుంటుందని అజేయ కల్లం వివరించారు. గవర్నర్ ఆ బిల్లును ఆమోదిస్తే రాష్ట్రంలో మళ్లీ అధికారిక ఖర్చులు చేసేందుకు వీలవుతుందని చెప్పారు.

ఇటీవలి శాసన సమావేశాల్లో జూన్ 17న అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించింది. అయితే శాసనమండలిలో ఆ బిల్లుకు మోక్షం కలగకుండానే, మండలి సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. దాంతో ఏపీ ఖజానా నుంచి నిధులు తెచ్చుకునేందుకు ప్రభుత్వానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. నిబంధనల ప్రకారం మండలికి వెళ్లిన 14 రోజుల తర్వాత ఆ బిల్లును గవర్నర్ కు పంపాల్సి ఉంటుంది. బుధవారం అర్ధరాత్రితో ఆ గడువు పూర్తి కావడంతో ద్రవ్య వినిమయ బిల్లును గవర్నర్ కు పంపేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.

More Telugu News