Chandrababu: కరోనా మృతులను ప్లాస్టిక్ పేపర్లలో చుట్టి జేసీబీలతో తరలించడమా?: చంద్రబాబు దిగ్భ్రాంతి

  • పలాసలో జేసీబీతో కరోనా మృతుల తరలింపు
  • వీడియో పోస్టు చేసిన చంద్రబాబు, లోకేశ్
  • జగన్ సర్కారు సిగ్గుపడాలన్న చంద్రబాబు
  • ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? అంటూ లోకేశ్ ఆగ్రహం
Chandrababu responds on corona victims transportation in Palasa

శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనాతో మరణించినవారిని జేసీబీతో తరలించడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ తో మృతి చెందిన వారిని ప్లాస్టిక్ పేపర్లలో చుట్టి జేసీబీలు, ట్రాక్టర్లలో తీసుకెళ్లడం దారుణం అని వ్యాఖ్యానించారు. మరణానంతరం కూడా వారికి తగిన గౌరవమర్యాదలు ఇవ్వడం అవసరం అని స్పష్టం చేశారు. మృతదేహాలను ఈ విధంగా అమానవీయ రీతిలో తరలిస్తుండడం పట్ల సీఎం జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

అటు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. పారాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోతుందని సీఎం జగన్ చెప్పినరోజే వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అర్థమైందని ట్వీట్ చేశారు. శ్రీకాకుళంలో జరిగిన ఘటన దారుణమని, ఈ ప్రభుత్వానికి మానవత్వం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.

పలాసలో 70 ఏళ్ల వృద్ధుడు చనిపోతే కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పి మృతదేహాన్ని పొక్లెయిన్ తో ఈడ్చుకుంటూ వెళ్లారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్నదానికి సంబంధమే లేదని మండిపడ్డారు. ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తే ప్రజల్లో ఎంతటి ఆందోళన ఉంటుందో సీఎం అర్థం చేసుకోవాలని హితవు పలికారు.


More Telugu News