Sri Chand Hinduja: హిందూజా సోదరుల మధ్య చిచ్చు రాజేసిన డాక్యుమెంట్... భగ్గుమన్న ఆస్తి వివాదాలు

  • కోర్టు ముందుకు చేరిన రూ.83 వేల కోట్ల ఆస్తి వివాదం
  • ఆరేళ్ల నాటి డాక్యుమెంట్ చెల్లదంటున్న శ్రీ చంద్ హిందూజా
  • డాక్యుమెంట్ ను గౌరవించాలంటున్న ఇతర సోదరులు
Key document ignites differences between Hinduja brothers

ప్రపంచ కుబేరుల జాబితాలో తప్పనిసరిగా ఉండే హిందూజా ఫ్యామిలీలో ఇప్పుడు చిచ్చు రేగింది. ఇన్నాళ్లూ సామరస్యంగా మెలిగిన హిందూజా సోదరుల మధ్య ఆస్తి వివాదాలు భగ్గుమంటున్నాయి. దీనికంతటికీ కారణం ఓ డాక్యుమెంట్. ఆరేళ్ల కిందట రాసిన ఆ డాక్యుమెంట్ 106 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న హిందూజా గ్రూపును అతలాకుతలం చేస్తోంది. రూ.83 వేల కోట్ల విలువైన ఆస్తుల వివాదం ఇప్పుడు లండన్ కోర్టు ముంగిట చేరింది.

దాదాపు 40 దేశాల్లో విస్తరించిన హిందూజా వ్యాపార సామ్రాజ్యం ఆస్తుల విలువ 11.2 బిలియన్ డాలర్లు! అయితే, 2014 నాటి ఓ డాక్యుమెంట్ ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఒక సోదరుడి పేరున కలిగి ఉన్న ఆస్తులు మిగతా సోదరులకు కూడా చెందుతాయన్నది ఆ పత్రం సారాంశం. ప్రతి ఒక్కరు తమ ఎగ్జిక్యూటర్లుగా మరొకరిని నియమించుకోవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు.

కానీ, ఈ డాక్యుమెంట్ చెల్లదని హిందూజా సోదరుల్లో పెద్దవాడైన శ్రీ చంద్, ఆయన కుమార్తె విను లండన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటివరకు తమ కుటుంబానికి కీలక ఆస్తిగా ఉన్న హిందూజా బ్యాంక్ ను చేజిక్కించుకునేందుకు తన సోదరులు గోపీచంద్, అశోక్, ప్రకాశ్ లు ప్రయత్నిస్తున్నారంటూ శ్రీ చంద్ పిటిషన్ దాఖలు చేశారు. హిందూజా బ్యాంక్ తన పేరిట ఉందని, దాన్ని తన నుంచి లాగేసుకునేందుకు 2014 నాటి డాక్యుమెంట్ ను తెరపైకి తెచ్చారని కోర్టుకు తెలిపారు. తామంతా సంతకాలు చేసినప్పటికీ ఆ డాక్యుమెంట్ ను ఓ వీలునామాగా చూడరాదని శ్రీ చంద్ అంటున్నారు.

శ్రీ చంద్ ఆస్తుల పంపకం చేయాలంటూ 2016లోనే కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడీ డాక్యుమెంట్ ను చెల్లకుండా చేస్తే, శ్రీ చంద్ ఆస్తులన్నీ కుమార్తె వినుకే చెందుతాయని, ఆపై ఆమె వారసులకు వెళతాయని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరాదని మిగతా ముగ్గురు సోదరుల పంతం. ఈ ఆస్తి వివాదం తమ వ్యాపారాలపై ప్రభావం చూపబోదని, విలువలే తమ కుటుంబ నిజమైన ఆస్తి అని ముగ్గురు సోదరులు అంటున్నారు. ఆస్తి డాక్యుమెంట్ ను అందరూ గౌరవించాల్సి ఉందని తెలిపారు.

More Telugu News