Shirdi: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో షిర్డీ ఆలయ ట్రస్టు... ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక సతమతం!

  • లాక్ డౌన్ తో మూతపడిన షిర్డీ ఆలయం
  • విరాళాలు రాకపోవడంతో నిలిచిన ఆదాయం
  • నిర్వహణ ఖర్చులు కూడా సమకూరని వైనం
Shirdi trust in heavy financial lose

కరోనా మహమ్మారి ప్రభావంతో దేశదేశాల ఆర్థిక వ్యవస్థలే అస్తవ్యస్తమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏటా 400 కోట్ల ఆదాయం పొందే ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలోనూ ఆర్థిక దుర్భిక్షం కళ్లకు కడుతోంది. ఇప్పుడా ఆలయ ట్రస్టు తన ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిని ఎదుర్కొంటోంది. గత మూడ్నెల్లుగా లాక్ డౌన్ పరిస్థితులు నెలకొనడంతో భక్తులెవరూ రావడంలేదు. విరాళాలు కూడా అందడంలేదు. దాంతో రోజుకు రూ.1.5 కోట్ల మేర నష్టం వస్తున్నట్టు ట్రస్టు వర్గాలంటున్నాయి.

దేశంలో తిరుమల శ్రీవారి క్షేత్రం తర్వాత అంతటి సంపన్న ఆలయంగా పేరుగాంచిన షిర్డీ ఆలయం ఇప్పుడు నిర్వహణ ఖర్చులు కూడా రాక సతమతమవుతోంది. వాస్తవానికి షిర్డీ ఆలయ ఉద్యోగులకు ప్రతి నెల 5వ తేదీన జీతాలు చెల్లిస్తారు. కానీ ఈసారి 20వ తేదీ వచ్చినా వేతనాలు అందక ఉద్యోగులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. సాధారణంగా ఆలయానికి వచ్చే విరాళాలను ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తారు. లాక్ డౌన్ ప్రభావంతో ఆలయానికి ఆర్జన తగ్గడంతో ఫిక్స్ డ్ డిపాజిట్ల నుంచే జీతాలు చెల్లించినా, మే నెలకు వచ్చేసరికి ఖాతాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో, జీతాలు అడిగితే ట్రస్టు వర్గాలు స్పందించడంలేదని ఉద్యోగులు వాపోతున్నారు.

అటు, షిర్డీలోని సాయిబాబా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధించారు. డాక్టర్లకు ఇచ్చే ప్రోత్సాహకాలు నిలిపివేసిన ట్రస్టు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 40 శాతం కోత విధించింది. భక్తులు ఎప్పటిలాగానే షిర్డీకి పోటెత్తితే ఆర్థిక కష్టాలన్నీ తీరుతాయని ట్రస్టు ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఏదేమైనా కరోనా వైరస్ సంపన్న ఆలయాలను సైతం ఆర్థిక నష్టాల్లో పడేస్తోంది.

More Telugu News