Prakasam District: విజృంభిస్తున్న కరోనా.. ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్

  • అనంతపురం జిల్లాలో ఎనిమిది ప్రాంతాలు
  • ప్రకాశం జిల్లాలో ఒంగోలు, చీరాల
  • శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గంలో లాక్‌డౌన్
Lockdown imposed in some places in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు వెలుగుచూస్తున్న ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించారు. రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 465 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7,961కి పెరిగింది. తాజా కేసుల్లో ఎక్కువగా కృష్ణా, చిత్తూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లోనే నమోదయ్యాయి.

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికిలో ఇప్పటి వరకు 29 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో ఒకే కాలనీకి చెందిన 16 మంది ఉన్నారు. ధర్మవరంలో 34 కేసులు బయటపడ్డాయి. దీంతో అనంతపురంతోపాటు ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లులో లాక్‌డౌన్ విధిస్తూ కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 296 కేసులు నమోదయ్యాయి. ఒక్క ఒంగోలులోనే 14 ప్రాంతాల్లో కలిపి 69 కేసులు నమోదు కాగా, చీరాల పరిధిలోనే 46 కేసులు వెలుగుచూశాయి. దీంతో ఒంగోలు, చీరాలలో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు కలెక్టర్ భాస్కర్ పేర్కొన్నారు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈ నెల 11న జరిగిన ఓ సంస్మరణ సభలో 200 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు  హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తికి ఆ తర్వాత కరోనా సోకగా, కాశీబుగ్గకు చెందిన ఓ వ్యాపారి కూడా కరోనా బారినపడ్డాడు. దీంతో ఈ రెండు ప్రాంతాలను కట్టడి ప్రాంతాలుగా గుర్తించిన అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఈ మేరకు కలెక్టర్ నివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News