Gorantla Madhav: జేసీకి ఈ గతి పడుతుందనుకోలేదు: గోరంట్ల మాధవ్

  • జిల్లానే శాసించిన వ్యక్తి జేసీ
  • అటువంటి వ్యక్తికి లోకేశ్ పరామర్శా
  • ప్రజలు లోకేశ్ ను తిరస్కరించలేదా?
  • హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్
Gorantla Madhav Fires on Nara Lokesh

"రాజకీయాల్లో ఎంతో అనుభవం, తన కనుసైగతోనే ప్రజలను శాసిస్తారని పేరున్న జేసీ దివాకర్ రెడ్డి వంటి వ్యక్తి వద్దకు నారా లోకేశ్ వచ్చి ధైర్యం చెబుతుంటే, ఆయనకు ఇంత గతి పడుతుందని అనుకోలేదంటున్నారు ప్రజలు" అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ అనుభవమున్న జేసీకి లోకేశ్ ధైర్యం చెబుతుంటే నవ్వు వస్తోందని, పక్కా ఆధారాలతో అరెస్ట్ లు జరిగితే, లోకేశ్ వారి కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం విడ్డూరంగా అనిపిస్తోందని అన్నారు.

ఓ సీఎం కుమారుడిగా, నటుడు బాలకృష్ణకు అల్లుడిగా బరిలోకి దిగినా, మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయారని గుర్తు చేస్తూ, ఓటమిపాలైన వ్యక్తి వచ్చి జేసీకి ధైర్యం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. లోకేశ్ మాట్లాడుతున్న మాటలను విని చిన్న పిల్లలు జోక్ గా తీసుకుని నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీలోకి రావాలంటూ ప్రలోభాలకు గురిచేసినా అచ్చెన్నాయుడు లొంగలేదని, అందుకే ఆయన్ను అరెస్ట్ చేయించారని లోకేశ్ ఆరోపించడంపై మాధవ్ మండిపడ్డారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్న విషయం గుర్తులేదా? అంటూ ప్రశ్నించారు.

జేసీ సోదరులు 6 వాహనాలకు మాత్రమే బీమా చేయించి, 151 వాహనాలకు నకిలీ ఇన్స్యూరెన్స్ పత్రాలను సృష్టించారని, ఈ విషయంలో అన్ని ఆధారాలూ పోలీసుల వద్ద ఉన్నాయని తెలిపారు. ఇక్కడ నేరం చేస్తే పట్టుబడిపోతామన్న భయంతో నాగాలాండ్ కు వెళ్లారని అన్నారు. తాము తుక్కు కింద వాహనాలను విక్రయించినట్టు అశోక్ లైలాండ్ సంస్థ రాతపూర్వకంగా తెలియజేసిందని అన్నారు.

More Telugu News