ICMR: 15 నుంచి 30 శాతం మందికి కరోనా సోకిందన్న ఐసీఎంఆర్ సర్వే రిపోర్టు... అసలు వాస్తవమిది!

  • జోన్లు, హాట్ స్పాట్లలో కరోనా విజృంభణ
  • లక్షణాలు కనిపించకుండానే తగ్గిందన్న సీరో సర్వే
  • సర్వే రిపోర్టు ఫైనలైజ్ కాలేదని ఐసీఎంఆర్ వివరణ
Report on Virus Spread is Not Final Says ICMR

ఇండియాలోని కంటైన్ మెంట్ జోన్లు, హాట్ స్పాట్ లలో 15 నుంచి 30 శాతం మందికి కరోనా సోకి ఉండవచ్చని, వారిలో చాలా మందిలో ఏ లక్షణాలూ కనిపించకుండానే వైరస్ తగ్గిపోయిందని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సీరో- సర్వే వెల్లడించిందంటూ వచ్చిన రిపోర్టు కలకలం రేపింది. జోన్లలో వైరస్ ఉన్న ప్రాంతానికి 100 నుంచి 200 మీటర్ల పరిధిలోని వారంతా దీని బారిన పడ్డారని, ముఖ్యంగా ముంబై, పుణె, ఢిల్లీ, అహ్మదాబాద్, ఇండోర్ నగరాల్లో ఈ పరిస్థితి నెలకొందని ఐసీఎంఆర్ సర్వే వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి.

ఈ సర్వేలో భాగంగా ప్రజల నుంచి రక్త నమూనాలను సేకరించి, పాథోజన్ లలో ఉన్న యాంటీ బాడీస్ గురించి పరీక్షలు నిర్వహించామని, రక్తంలో వైరస్ కొనసాగుతున్నా, లక్షణాలు మాత్రం కనిపించలేదని పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ భారత కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వాలు, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సహకారంతో 70 జిల్లాల నుంచి 24 వేలకు పైగా నమూనాలు సేకరించి పరీక్షించినట్టు కూడా కథనాలు వెలువడ్డాయి.

ఇండియాలోని మొత్తం కేసుల్లో 70 శాతం కేసులు వచ్చిన ముంబై, అహ్మదాబాద్, పుణె, ఢిల్లీ, కోల్ కతా, ఇండోర్, థానే, జైపూర్, చెన్నై, సూరత్ నగరాల నుంచి 500 చొప్పున శాంపిల్స్ సేకరించిన ఐసీఎంఆర్, మరో 21 రాష్ట్రాల్లోని 60 జిల్లాల నుంచి 400 చొప్పున నమూనాలు తీసుకున్నట్టు కూడా అధికారులు తెలిపినట్టు వార్తలు ప్రచురితం కాగా, అవి కలకలాన్ని రేపాయి.

ఇక ఈ వార్తలపై వివరణ ఇచ్చిన ఐసీఎంఆర్, సర్వే ఫలితాలపై ఇంకా ఓ తుది నిర్ణయానికి రాలేదని స్పష్టం చేసింది. ఈ వార్త ఊహాజనితమేనని వెల్లడిస్తూ, ఓ ట్వీట్ పెట్టింది. అయితే, అనుకున్నదానికన్నా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని మాత్రం చెప్పగలమని ఐసీఎంఆర్ కు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.

More Telugu News