Athletes: డిసెంబరులో కాదు, అక్టోబరులోనే చైనాలో కరోనా కలకలం... క్రీడాకారుల నోట సంచలన నిజాలు!

  • డిసెంబరులో కరోనా ఉనికి బయటపడిందంటున్న చైనా
  • అక్టోబరులోనే చైనాలో కరోనా పరిస్థితులు చూశామంటున్న అథ్లెట్లు
  • వుహాన్ వీధులు అప్పుడే నిర్మానుష్యంగా కనిపించాయని వెల్లడి
Military athletes says they observed corona like situations in China earlier

చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రస్థానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు విస్తరించింది. ఇప్పటివరకు 47 లక్షల మందికి పైగా కరోనా సోకగా, 3.15 లక్షల మంది మృత్యువాత పడ్డారు. దీనికంతటికీ కారణం చైనాయేనని అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు ఆరోపిస్తున్నాయి.

వైరస్ వ్యాప్తిని చైనా దాచిందని, ఆ వైరస్ వుహాన్ లోని ఓ ప్రయోగశాలలో ఉద్భవించిందని ఆరోపణలు మిన్నంటుతున్నాయి. అయితే అంతకుమించిన సంచలన వాస్తవాలను ప్రపంచ సైనిక క్రీడాకారులు వెల్లడించారు. బయటకు వెల్లడైన వివరాల ప్రకారం చైనాలో డిసెంబరు చివరిలో వెలుగు చూసిన కరోనా జనవరిలో తీవ్రరూపు దాల్చింది.

అయితే, గతేడాది అక్టోబరులోనే అనేకమంది క్రీడాకారులు గుర్తుతెలియని వ్యాధితో బాధపడ్డారని, అవి ఫ్లూ తరహా లక్షణాల్లాగా ఉన్నాయని పలువురు క్రీడాకారులు తెలిపారు. అసలేం జరిగిందంటే.... 2019లో వుహాన్ లో ప్రపంచ సైనిక క్రీడలు నిర్వహించారు. ఈ క్రీడల్లో పాల్గొన్న వారిలో చాలామంది అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారట. తామెప్పుడూ ఇంతలా తీవ్ర అనారోగ్యానికి గురికాలేదని, చైనా నుంచి వచ్చిన కొన్నిరోజులకే తన తండ్రికీ సోకిందని జర్మనీ వాలీబాల్ క్రీడాకారిణి జాక్వెలిన్ బాక్ తెలిపింది.

వుహాన్ లో తొలి కేసు నమోదైంది డిసెంబరులో అని చెబుతున్నప్పటికీ, అక్టోబరులో అక్కడి వీధులు నిర్మానుష్యంగా కనిపించాయని, ఎందుకో తమకు అర్థం కాలేదని లక్జెంబర్గ్ ట్రయాథ్లాన్ అథ్లెట్ ఒలివర్ జార్జెస్ వెల్లడించాడు. స్థానికులు బయట తిరగొద్దని నాడు వుహాన్ లో ఆంక్షలు ఉన్నట్టు చెప్పుకునేవారని వివరించాడు. అంతేకాకుండా, వీధుల్లో రసాయనాలు చల్లడం చూశామని చాలామంది అథ్లెట్లు తనతో చెప్పారని జార్జెస్ పేర్కొన్నాడు. విమానాశ్రయంలో థర్మల్ స్కానర్ తో శరీర ఉష్ణోగ్రతలు తీసుకున్నారని, బయటి నుంచి ఆహారం తీసుకోవద్దని చెప్పడం కూడా తమకు అప్పట్లో విచిత్రంగా అనిపించిందని అన్నాడు.

వుహాన్ లో తామున్న భవంతిలో చాలామంది ఫ్లూ లక్షణాలతో బాధపడడం తాను గమనించానని ఇటలీకి చెందిన ఫెన్సింగ్ క్రీడాకారులు టగ్లీ లారియోల్ తెలుపగా... తనలోనూ, తన పార్ట్ నర్ లోనూ ఆ లక్షణాలు కనిపించాయని ఫ్రాన్స్ కు చెందిన ఇలోడీ క్లౌవెల్ అనే పెంటాథాన్ అథ్లెట్ వెల్లడించింది. ఇన్నాళ్లకు ఈ క్రీడాకారులందరూ తమ అనుభవాలను వెల్లడిస్తుంటే చైనాలో కరోనా వైరస్ అక్టోబరులోనే వ్యాప్తి చెందిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో చూడాలి.

More Telugu News