Pawan Kalyan: వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చే బాధ్యత రాష్ట్రాలు తీసుకోవాలి: పవన్ కల్యాణ్

  • వలస కార్మికుల వెతలపై పవన్ ఆవేదన
  • అన్ని రాష్ట్రాల యంత్రాంగాలు సమన్వయంతో వ్యవహరించాలని సూచన
  • వలస కార్మికులపై లాఠీచార్జి బాధాకరమంటూ వ్యాఖ్యలు
Pawan Kalyan responds on Migrants issues amidst lock down

లాక్ డౌన్ నేపథ్యంలో స్వస్థలాలకు చేరుకునేందుకు అలుపెరగక ప్రయాణిస్తున్న వలస కార్మికుల బాధలు హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వస్థలాలకు వెళ్లే క్రమంలో వారు అనేక ప్రమాదాలకు గురవుతున్నారని, మరికొందరు మార్గమధ్యంలో అనారోగ్యంతో ప్రాణాలు వదులుతున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధంగా స్పందించాలని, వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చే బాధ్యత రాష్ట్రాలు తీసుకోవాలని సూచించారు.

అన్ని రాష్ట్రాల యంత్రాంగాలు సమన్వయంతో వ్యవహరిస్తే వలస కార్మికుల సమస్యలు తీరతాయని వ్యాఖ్యానించారు. వలస కార్మికుల చెమట చుక్కలే రాష్ట్రాల ఆర్థికాభివృద్ధిలో కీలకంగా ఉన్నాయన్న విషయాన్ని విస్మరించరాదని పవన్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఒడిశా, అసోం, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందినవారు పనిచేస్తున్నారని, ప్రకాశం జిల్లా గ్రానైట్ పరిశ్రమల్లో ఒడిశా కూలీలు పనిచేస్తున్నారని వివరించారు.

అయితే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వలస కూలీలను సరిహద్దుల వద్ద వదిలిపెడతాం అని పేర్కొనడం బరువు వదిలించుకుంటున్నట్టుగా ఉందని, అలా కాకుండా కూలీల స్వస్థలాల వరకు ప్రజా రవాణా వ్యవస్థ బస్సులను నడపాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని బస్సుల ద్వారానో, శ్రామిక్ రైళ్ల ద్వారానో కూలీలను వారి స్వస్థలాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు.

తమిళనాడు నుంచి తిరిగి వస్తున్న ఏపీ కార్మికులను తడ సరిహద్దుల్లో నిలిపివేసి, అనుమతించడంలేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని, అదే సమయంలో చత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల వారిని ఆధార్ కార్డు చూపిస్తే వదిలిపెడుతున్నారని, మన రాష్ట్రం వారిని వదిలిపెట్టడంలేదని ఆరోపించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు.

ఇక గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద వలస కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమని, మైళ్ల తరబడి నడుస్తూ, సైకిళ్లు తొక్కుతూ వస్తున్న వారి వేదనను అధికారులు, పోలీసులు అర్థం చేసుకోవాలని హితవు పలికారు.

More Telugu News