MIgrant worker: బైక్ పై బాలింత భార్యతో యూపీకి వలస కార్మికుడి పయనం!

  • ఉత్తరప్రదేశ్ కి చెందిన వలస కార్మికుడు అక్రం
  • బెంగళూరులో వెల్డింగ్ పనులతో జీవనం 
  • లాక్ డౌన్ తో ఉపాధి లేక సొంత రాష్ట్రానికి పయనం

లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరే ప్రయత్నంలో పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వలస కార్మిక కుటుంబం తమ స్వస్థలం చేరేందుకు ఓ బైక్ ను వాహనంగా చేసుకుంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ అక్రం వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. తల్లిదండ్రుల పోషణ బాధ్యతతో పాటు తన ఏడుగురు తోబుట్టువుల బాధ్యత కూడా అక్రంపైనే ఉంది. ఉపాధి పనుల నిమిత్తం బెంగళూరుకు వలస వెళ్లాడు. అతనితో పాటు ఇద్దరు తమ్ముళ్లను కూడా తన వెంట తీసుకెళ్లాడు. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి వెల్డింగ్ పనులు లేకపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. అద్దె చెల్లించాలని ఇంటి యజమాని కూడా అడిగాడు.

మరోపక్క, గత నెల 9వ తేదీన గర్భవతి అయిన అక్రమ్ భార్య హర్మాఖాతూన్ బిడ్డకు జన్మనిచ్చింది. దాచుకున్న డబ్బులతో ఈ లాక్ డౌన్ లో జీవితాన్ని లాక్కొస్తున్న అక్రమ్ కుటుంబం ఒక పూట మాత్రమే బోజనం చేసే పరిస్థితి. ఇంకా, బెంగళూరులోనే ఉంటే ఇబ్బందులు తప్పవని భావించిన అక్రమ్ యూపీకి వెళ్లిపోవాలని అనుకున్నాడు.

దాంతో ఈ నెల 12న తన భార్యను, పసి బిడ్డను, తమ మొదటి బిడ్డను తీసుకుని బైక్ పై యూపీకి బయలుదేరాడు. కర్నూలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు గాయపడ్డారు. పిల్లలకు మాత్రం ఏమీ కాలేదు. తెలంగాణ రాష్ట్రం మీదుగా యూపీకి ఈ కుటుంబం బైక్ పై ప్రయాణం సాగిస్తోంది.

More Telugu News