Nagaland: రూ. 10 వేలు ఇస్తాం.. దయచేసి రాష్ట్రానికి రావొద్దు: నాగాలాండ్ ఆఫర్

  • సొంత రాష్ట్రానికి వచ్చేందుకు 18 వేల మంది నాగాల దరఖాస్తు
  • ఎక్కడి వారు అక్కడే ఉండాలంటూ ప్రభుత్వం పిలుపు
  • వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం రూ. 10 వేల జమ
Nagaland offers 10 thousand to migrant workers

లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను నడుపుతోంది. వేలాది మంది వలస కూలీలు ఈ రైళ్ల ద్వారా సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగాలాండ్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారు ఇప్పుడప్పుడే రావొద్దని, వారందరికీ రూ. 10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది.

వలస కార్మికుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నాగాలాండ్ కరోనా రహిత రాష్ట్రంగా ఉంది. ఈ నేపథ్యంలో వలస కూలీలు తిరిగి వస్తే కరోనా ఎక్కడ వ్యాప్తి చెందుతుందోనన్న ఆందోళనతో ఎక్కడి వారు అక్కడే ఉండేలా ఖర్చులు, ఇతర అవసరాల కోసం రూ. 10 వేల ఆర్థిక సాయం ప్రకటించింది.

వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన దాదాపు 18 వేల మంది నాగాలు స్వరాష్ట్రానికి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నట్టు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి టెంజెన్ టోయ్ తెలిపారు. అయితే, వారెవరూ ఇప్పుడే రావాల్సిన అవసరం లేదని, ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వృద్ధులు, చికిత్స తీసుకుంటున్న రోగుల ఖర్చుల కోసం రూ. 10వేలు జమచేస్తామని ఆయన వివరించారు. వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ మొత్తాన్ని జమచేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News