Maharashtra: కరోనా ఎఫెక్ట్: మహారాష్ట్ర జైళ్ల నుంచి 50 శాతం మంది ఖైదీల విడుదలకు నిర్ణయం

  • మహారాష్ట్రలో కరోనా బీభత్సం
  • ముంబయి ఆర్ధర్ రోడ్ జైల్లో 184 మంది ఖైదీలకు కరోనా
  • ఖైదీలకు బెయిల్ లేదా పెరోల్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
Maharashtra decides to release prisoners due to corona outbreak

భారత్ లో అత్యధిక స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. 23 వేలకు పైగా పాజిటివ్ కేసులు, 868 మరణాలతో మహారాష్ట్ర తల్లడిల్లుతోంది. నిత్యం భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తుండడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా వ్యాప్తి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జైళ్లలోని సగం మంది ఖైదీలను విడుదల చేయాలని ఓ అత్యున్నత నిర్ణాయక కమిటీ తీర్మానించింది. జైళ్లలోని 50 శాతం మంది అంటే 35,239 మంది ఖైదీలను మధ్యంతర బెయిలు లేదా పెరోల్ పై బయటికి పంపనున్నారు. ముంబయిలోని ఆర్ధర్ రోడ్ సెంట్రల్ జైల్ లో 184 మంది ఖైదీలు కరోనా బారినపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఏ కేటగిరీ ప్రకారం ఖైదీలను విడుదల చేస్తారు? ఎప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది? అనే అంశాలపై అత్యున్నత కమిటీ స్పష్టత ఇవ్వలేదు. అయితే ఖైదీలకు బెయిల్ ఇచ్చేందుకు తగిన విధానాలు అనుసరిస్తామని జస్టిస్ ఏఏ సయీద్ ఆధ్వర్యంలోని ఈ కమిటీ పేర్కొంది. ఈ కమిటీలో హోంశాఖ అదనపు కార్యదర్శి సంజయ్ చహండే, జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ పాండే సభ్యులుగా ఉన్నారు. బెయిల్ ఇవ్వడం అంటేనే న్యాయబద్ధమైన విధివిధానాలను పాటించడం అని, ఖైదీలను బెయిల్ పైనే బయటికి పంపడం జరుగుతుందని ఎస్ఎన్ పాండే వివరించారు.

More Telugu News