Anand Mahindra: చక్కటి అడుగు... మీతో పాటు దేశమంతటికీ లాభమే: ముఖేష్ అంబానీపై ఆనంద్ మహీంద్రా పొగడ్తలు

  • వైరస్ తరువాత భారత్ కు ఎంతో ప్రాముఖ్యత
  • ప్రపంచ వృద్ధికి ఇండియానే సరికొత్త కేంద్రం
  • చక్కటి డీల్ కుదిరిందంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్
Anand Mahindra Praises Jio Facebook Deal

రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ 5.7 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 43,574 కోట్లు) పెట్టుబడి పెట్టాలని నిర్ణయించడాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్వాగతించారు. ఈ డీల్ తో కేవలం ముఖేశ్ అంబానీ మాత్రమే కాదని, భారతీయులంతా లాభపడతారని తన ట్విట్టర్ ఖాతాలో ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా దిగ్గజంతో మెగా డీల్ ను కుదుర్చుకున్న రిలయన్స్ అధినేతను ఆయన పొగడ్తల్లో ముంచెత్తారు.

"ఫేస్ బుక్ తో జియో డీల్ ఆ రెండు కంపెనీలకు మాత్రమే మేలును కలిగించదు. వైరస్ కష్టాల నేపథ్యంలో ఈ డీల్ కుదిరింది. వైరస్ తరువాత భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందోననడానికి ఈ డీల్ బలమైన సంకేతం. ప్రపంచ వృద్ధికి ఇండియా సరికొత్త కేంద్రం కానుందన్న ఊహ ప్రపంచానికి బలంగా అందించింది. చాలా చక్కటి డీల్ ను కుదుర్చుకున్నారు. బ్రావో ముఖేశ్" అని ఆయన అన్నారు.

కాగా, ఈ డీల్ లో భాగంగా జియో ప్లాట్ ఫామ్స్ లో ఫేస్ బుక్ 9.99 శాతం వాటాను పొందనున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ముఖేశ్ అంబానీ స్వయంగా వెల్లడించి గత కొంతకాలంగా రెండు కంపెనీల మధ్య డీల్ పై వస్తున్న ఊహాగానాలను నిజం చేశారు. 

More Telugu News