Containment Zone: అధికారులను గొంతెమ్మ కోర్కెలు కోరుతున్న కంటైన్మెంట్ జోన్ ప్రజలు

  • ఢిల్లీలో 76 కంటైన్మెంట్ జోన్లు
  • బిర్యానీ, మటన్ కర్రీ, పిజ్జాలు, సమోసాలు కావాలంటున్న ప్రజలు
  • తమ వల్ల కాదంటున్న అధికారులు
  • నిత్యావసరాలైతే తెచ్చిస్తామని స్పష్టీకరణ
People in containment zone frivolously orders

కరోనా పాజిటివ్ వ్యక్తులు నివసించే ఏరియాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడం తెలిసిందే. ఒక్కసారి కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తే ఆ ప్రాంతానికి మిగతా ఏరియాలతో సంబంధాలు తెగిపోతాయి. ఆ ప్రదేశం మొత్తం పోలీసులు, అధికారుల అధీనంలోకి వెళ్లిపోతోంది. కరోనా బాధితుడి కుటుంబీకులే కాదు, అతడి చుట్టుపక్కల ఇళ్లవారిపైనా నిఘా ఉంటుంది. వారు ఇళ్లలోంచి అడుగు బయటపెట్టడానికి వీల్లేదు. వారికి అవసరమైన నిత్యావసరాలన్నీ పోలీసులే అందజేస్తారు. ఆంక్షలు అంత కఠినంగా ఉంటాయి మరి!

ఈ నేపథ్యంలో ఢిల్లీలోనూ అనేక ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అయితే, ఆ జోన్లలోని ప్రజలు లాక్ డౌన్ కారణంగా జిహ్వచాపల్యాన్ని చంపుకోలేక, నచ్చింది తినలేక సతమతమవుతున్నారట. దాంతో అధికారులకు తమ కోర్కెల చిట్టా వెల్లడిస్తున్నారు. కొందరు చికెన్ బిర్యానీ కావాలని, మటన్ కర్రీ కావాలని, పిజ్జాలు, స్వీట్లు, వేడివేడి సమోసాలు కావాలని కోరుతున్నారట. వారు కోరినవన్నీ తెచ్చివ్వలేక అధికారుల తల ప్రాణం తోకకు వస్తోంది.

మామూలు నిత్యావసరాలైతే తెచ్చివ్వగలమని, ఇలాంటి కోర్కెలు తీర్చడం తమ వల్ల కాదని అధికారులు తెగేసి చెబుతున్నారు. కూరగాయలు, పాలు, మంచినీరు అయితే ఫర్వాలేదు కానీ, అంతకుమించి కోర్కెలు కోరితే అంగీకరించవద్దని క్షేత్రస్థాయిలో తమ సిబ్బందికి కూడా స్పష్టం చేశామని ఢిల్లీ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో కరోనా వ్యాప్తి కారణంగా 76 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.

More Telugu News