Lockdown: లాక్‌డౌన్‌తో కష్టాలు.. గుడిముందు నాలుక కోసుకున్న యువకుడు

  • గుజరాత్‌లో ఘటన
  • రక్తపు మడుగులో కూలీ
  • గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లిన బీఎస్‌ఎఫ్‌ బలగాలు
  • మూఢ నమ్మకంతోనే ఇలా చేసి ఉంటాడని అనుమానాలు
migrant sculptor cuts off his tongue at Gujarat temple

కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో దేశ వ్యాప్తంగా కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ఆకలి, మరోవైపు ఉండడానికి వసతి కూడా లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. లాక్‌డౌన్‌ వల్ల కొన్ని వారాలుగా ఇంటికి వెళ్లలేకపోతోన్న ఓ కూలీ గుడి ముందు నాలుక కోసుకున్న ఘటన గుజరాత్‌లో కలకలం రేపింది.
 
దీంతో అతడు రక్తపు మడుగులో పడి కనపడ్డాడు. అయితే, కరోనా భయంతో అతడి వద్దకు వచ్చేందుకు స్థానికులు భయపడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ బ‌ల‌గాలు అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి. అతడు మధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన వివేక్ శ‌ర్మ (24) అని అధికారులు గుర్తించారు. అతడు శిల్పాలు చెక్కే పనులు చేస్తుంటాడని తెలిపారు.

గుజ‌రాత్‌లోని బ‌న‌స్కంత జిల్లాలోని నాదేశ్వ‌రి మాతాజీ ఆల‌యంలో అతడు ప‌ని చేస్తున్నాడని, లాక్‌డౌన్ వ‌ల్ల ఇంటికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇటువంటి చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అయితే, కష్టాలు తీరేందుకు మూఢ నమ్మకంతో దేవ‌త‌ల‌కు నాలుక‌ను బ‌లి ఇచ్చి ఉండొచ్చని కొందరు అంటున్నారు. అతడు కోలుకున్నాక అతడి నుంచి స్టేట్‌మెంట్ తీసుకుంటామని, అప్పటివరకు అతడు ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డాడో తెలియరాదని అధికారులు చెప్పారు.

More Telugu News