Marriage: కరోనా కాలం.. లక్నోలోని వధువు మెడలో తాళికట్టనున్న కేరళలోని వరుడు!

  • 26న జరగనున్న వాట్సాప్ వివాహం
  • వధువు స్వగ్రామానికి వచ్చేందుకు అడ్డుగా మారిన లాక్‌డౌన్
  • జాతక రీత్యా రెండేళ్లపాటు లేని ముహూర్తాలు
kerala couple ready for whatsapp marriage

కరోనా వైరస్ దెబ్బకు జీవితాలు అతలాకుతలం అవడమే కాదు.. జీవితాల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. కేరళలో జరగబోతున్న ఈ ఘటన అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలవబోతోంది. బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్‌గా జరగాల్సిన పెళ్లి వాట్సాప్‌ వీడియో కాల్ ద్వారా జరగబోతోంది. ఇందులో ఇంకో విచిత్రం కూడా ఉంది. వరుడు కేరళలో ఉంటే, వధువు లక్నోలో ఉంది. ఇక్కడబ్బాయి.. అక్కడమ్మాయి మెడలో వాట్సాప్‌లో తాళికట్టబోతున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం!

కొట్టాయంకు చెందిన 30 ఏళ్ల శ్రీజిత్ నటేశన్ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి. పల్లిప్పాడ్‌కు చెందిన అంజన (28) ఐటీ ఉద్యోగి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పనిచేస్తోంది. ఈ నెల 26న వీరి పెళ్లి జరపాలని పెద్దలు నిశ్చయించారు. దీంతో 18నే కేరళకు రావాలని అంజన నిర్ణయించుకుంది. అయితే, లాక్‌డౌన్ పొడిగింపుతో అది సాధ్యం కాలేదు. ఆలోచనలో పడిన పెద్దలు వివాహాన్ని వాయిదా వేయాలని అనుకున్నారు. అయితే, మరో చిక్కొచ్చి పడింది.

వీరిద్దరి జాతకాల రీత్యా మరో రెండేళ్ల వరకు మంచి ముహూర్తాలు లేవని జ్యోతిష్యుడు తేల్చేశాడు. దీంతో అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరపాలని నిర్ణయించారు. మరి అమ్మాయి లక్నోలో ఉందిగా. దీనికీ ఓ పరిష్కారం చూపించారు. ముందుగా నిశ్చయించిన ముహూర్తానికి వాట్సాప్‌ వీడియో కాల్‌ ద్వారా పెళ్లితంతు కానిచ్చేయాలని ఇరు కుటుంబాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. అంతేకాదు, వరుడు ఇక్కడ తాళి చూపించగానే, ముందుగానే సిద్ధం చేసుకున్న తాళిని అక్కడున్న వధువు తన మెడలో వేసుకోనుంది. కరోనా (కలి)కాలం అంటే ఇదేనేమో! మున్ముందు మరెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో ఏమో!

More Telugu News