Yadeiyurappa: తల్లిని వదిలి ఉండలేక చిన్నారి ఏడుపు... అది చూసి తల్లి కన్నీరు... 'నర్సు' వీడియోను షేర్ చేసిన సీఎం యడియూరప్ప!

  • కర్ణాటకలోని బెళగావిలో ఘటన
  • ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి
  • బిడ్డను చూసినా కలుసుకోలేని స్థితి
  • స్వయంగా ఫోన్ చేసి అభినందించిన యడ్యూరప్ప
Nurse Breakdown After Daughter Cry

తల్లి ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. కరోనా కేసులు పెరగడంతో, ఆమె 15 రోజులుగా ఇంటి ముఖం చూడలేదు. ఆమె బిడ్డ, తండ్రితో కలిసి ఆసుపత్రికి వచ్చి, తల్లిని చూసి, తనను తీసుకెళ్లాలంటూ బోరున విలపించింది. ఆ బిడ్డ బాధను తీర్చలేక, తండ్రి ఓదారుస్తుంటే, ఆ తల్లి హృదయం భారమై, కన్నీటితో చేతులూపుతూ ఆసుపత్రిలోకి వెళ్లిపోయింది. కర్ణాటకలోని బెళగావిలోని ఓ ఆసుపత్రి వద్ద ఈ ఘటన జరుగగా, రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప దాన్ని షేర్ చేయగా, అది వైరల్ అయింది.

ఆ బిడ్డ తల్లి, కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్ వర్కర్ గా ఆసుపత్రిలో సేవ చేస్తోంది. హెల్త్ కేర్ వర్కర్లు, తమ కుటుంబాలను కలవకుండా, కరోనా రోగులను కాపాడే పనిలో నిద్రాహారాలు మాని శ్రమిస్తున్నారు. ఈ వీడియోను టీవీలో చూశానని చెప్పిన యడ్యూరప్ప, "మీరంతా పిల్లలను వదిలిపెట్టి మరీ ఎంతో శ్రమిస్తున్నారు. ఓర్పుతో వ్యవహరించండి. మీకందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతా మంచే జరుగుతుంది. మీ గురించి నేను ఆలోచిస్తా. మిమ్మల్ని దేవుడు దీవించాలని కోరుతున్నా. మీ శ్రమ ఫలిస్తుందని ఆశిస్తున్నా" అని ఆమెతో ఫోన్ లో మాట్లాడారు. ఆమెను స్వయంగా అభినందించారు.

అంతకుముందు ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులను అభినందిస్తూ, కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని కితాబునిచ్చారు.

More Telugu News